బ్రిటన్ చట్టం నుంచి తప్పించుకుని దాక్కోనే చోటు కాదు 

బ్రిటన్ అంటే, చట్టం నుంచి తప్పించుకుని, దాక్కోవడానికి అనువైన చోటు కాదని ఆ దేశ భద్రతా శాఖ మంత్రి టామ్ టుగెంధట్ స్పష్టం చేశారు. అయితే, నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని తమ దేశం నుంచి పంపించడానికి న్యాయపరమైన ప్రక్రియలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
 
బ్యాంకుల‌కు కోట్లాది రూపాయ‌ల ఎగ‌వేత కేసులో అభియోగాలు ఎదుర్కొని విదేశాల‌కు పారిపోయిన బిలియ‌నీర్లు మాల్యా, నీర‌వ్ మోదీల‌ను తిరిగి దేశానికి ర‌ప్పించేందుకు భార‌త్ ప్ర‌య‌త్నిస్తున్న నేప‌ధ్యంలో బ్రిట‌న్ మంత్రి వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. నిందితుల అప్ప‌గింత వ్య‌వ‌హారంలో భార‌త్‌, బ్రిట‌న్ ఇరు దేశాలూ చ‌ట్ట‌ప‌ర‌మైన ప్ర‌క్రియ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉండాల‌ని నిర్ధిష్టంగా పేర్ల‌ను ప్ర‌స్తావించ‌కుండా తుగేన్‌ధాట్ పేర్కొన్నారు.
 
న్యాయం నుంచి త‌ప్పించుకుంటూ ఆశ్ర‌యం పొందాల‌నుకునే వారికి స‌రైన ప్ర‌దేశంగా మారాల‌నే ఉద్దేశం త‌మ ప్ర‌భుత్వానికి లేద‌ని టామ్ తుగేన్‌ధాట్ చెప్పారు. బ్రిట‌న్ మంత్రి కోల్‌క‌తాలో జీ20 అవినీతి వ్య‌తిరేక మంత్రిత్వ గ్రూప్ స‌మావేశం నేప‌ధ్యంలో భార‌త్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఢిల్లీలో విదేశీ వ్య‌వ‌హారాల మంత్రి ఎస్ జైశంక‌ర్‌, జాతీయ భద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్‌తో బ్రిట‌న్ మంత్రి టామ్ తుగేన్‌ధాట్ సంప్ర‌దింపులు జ‌రిపారు.

టామ్ టుగెంధట్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సంస్థ ప్రతినిధి విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి అనేక మంది ఆర్థిక నేరగాళ్లు బ్రిటన్‌లో ఉన్నారని, వారిని భారత దేశానికి పంపించాలని భారత ప్రభుత్వం కోరుతోందని ప్రశ్నించినప్పుడు ఈ సమాధానం ఇచ్చారు.  విజయ్ మాల్యా దాదాపు రూ.9,000 కోట్లు బ్యాంకు రుణాలను ఎగవేసి, 2016లో బ్రిటన్ పారిపోయారు. అదేవిధంగా నీరవ్ మోదీ దాదాపు 2 బిలియన్ డాలర్ల పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, ఆయన కూడా బ్రిటన్‌లోనే తలదాచుకుంటున్నారు.