ఉభయసభలు నిరవధిక వాయిదా

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆద్యంతం రసాభాసగా కొనసాగాయి. అటు రాజ్యసభ, ఇటు లోక్‌సభ ఉభయసభల్లోనూ ఎలాంటి ఫలవంతమైన చర్చ లేకుండానే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిపోయాయి. మణిపూర్‌లో హింసాత్మక ఘటనల అంశం ఉభయసభలను కుదిపేసింది.  కేవలం ఢిల్లీ సర్వీసుల బిల్లు, అవిశ్వాస తీర్మాణంలపై మాత్రమే చర్చలు జరిగాయి. 
మణిపూర్‌ అంశం చర్చ చేపట్టాలంటూ కాంగ్రెస్‌ సహా విపక్షాలు పట్టుపట్టడంతో  ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. విపక్షాల ఆందోళనల నడుమే అధికార పక్షం కొన్ని బిల్లులకు ఆమోదముద్ర వేయించుకుంది. ఆఖరి రోజైన శుక్రవారం లోక్‌సభలో కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నాయకుడు అధిర్‌ రంజన్‌ చౌదరి సస్పెన్షన్‌పై రభస జరిగింది. రాజ్యసభలోనూ ఆప్‌ ఎంపీలు సంజయ్‌ సింగ్‌, రాఘవ్‌ చద్దాలపై సస్పెన్షన్‌లను ఎత్తివేయాలని డిమాండ్‌లు వెల్లువెత్తాయి. 

శుక్రవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే అధిర్‌ రంజన్‌ చౌదరిపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని కాంగ్రెస్‌ సహా విపక్ష పార్టీల సభ్యులంతా డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్‌ సభను ముందుగా 12 గంటల వరకు, ఆ తర్వాత 12.30 గంటల వరకు వాయిదా వేశారు. 

అనంతరం కూడా సభలో అదే పరిస్థితి కొనసాగడంతో  స్పీకర్‌ ఓం బిర్లా లోక్‌సభను నిరవధిక వాయిదా వేశారు. జూలై 20న ప్రారంభమైన లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో 17 సార్లు సభ సమావేశమైందని, 44 గంటల 15 నిమిషాలు సభ పనిచేసిందని ఆయన వివరించారు. 20 బిల్లులను సభలో ప్రవేశపెట్టగా, 22 బిల్లులను సభ ఆమోదించినట్టు చెప్పారు.

సభా కార్యక్రమాల్లో భాగంగా జూలై 26న కేంద్రంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని విపక్షాలు ప్రవేశపెట్టగా స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. దీనిపై మూడు రోజుల పాటు చర్చ జరిగింది. 60 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు. ఇక రాజ్యసభలో ఆఖరిరోజైన శుక్రవారం కూడా విపక్షాల నిరసనల నడుమే చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ రాజ్యసభను నిరవధిక వాయిదా వేశారు