
ప్రధాన ఎన్నికల కమిషనర్(సిఇసి), ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) స్థానంలో కేంద్ర మంత్రికి స్థానం కల్పించడానికి ఉద్దేశించిన బిల్లును కేంద్రం ప్రభుత్వం గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, క్యాబినెట్ మంత్రితో కూడిన ముగ్గురు సభ్యుల ప్యానెల్ మాత్రమే ఎన్నికల సంఘం నియామకాలను రాష్ట్రపతికి సిఫార్సు చేస్తుంది.
ఈ మేరకు ప్రతిపాదించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్ల (సర్వీస్, నియామక నిబంధనలు, పదవీకాలం) బిల్లు 2023ను కేంద్రం తీసుకొచ్చింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రాం మేఘావల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తిని నిర్ధారించేందుకు ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు ఒక స్పష్టత ఇచ్చింది. ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్షనేత, సీజేఐతో కూడిన కమిటీ సలహా మేరకు ఎన్నికల సంఘానికి నియామకాలు జరుపాలని తెలిపింది. ఎన్నికల సంఘం ఎంపిక విధానంపై పార్లమెంట్ ఒక చట్టాన్ని రూపొందించే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొంది.
జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పునకు ముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్లను కేంద్రం సిఫార్సు మేరకు రాష్ట్రపతి నియమించేవారు. కాగా, సెలక్షన్ కమిటీలో ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతోపాటు సీజేఐ ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. అయితే కొత్త బిల్లులో ప్రతిపాదించిన ముగ్గురు సభ్యుల సెలక్షన్ ప్యానెల్ నుంచి సీజేఐని మినహాయించింది.
More Stories
పహల్గాం ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఎ దర్యాప్తు
కైలాస మానససరోవర్ యాత్రకు వెబ్సైట్ ప్రారంభం
రక్షణ దళాల కదలికల ప్రసారాలపై కేంద్రం ఆంక్షలు!