అవిశ్వాస తీర్మానంకు ఒక్క సరైన అంశం లేదు 

ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఒక్క సరైన అంశం కూడా లేదని ఇంతవరకూ జరిగిన చర్చతో రుజువైందని హోమంత్రి అమిత్‌షా ధ్వజమెత్తారు.  కేంద్రంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్ సభలో మాట్లాడుతూ  ప్రధానిపై, కానీ ప్రభుత్వంపై కానీ అసలు అవిశ్వాసమన్నదే లేదని స్పష్టం చేశారు.

ప్రధానిపై, కానీ ప్రభుత్వంపై కానీ అసలు అవిశ్వాసమన్నదే లేదని, లేనిదాన్ని ఉన్నట్టు చూపించే ఒక భ్రమను సృష్టించేందుకే అవిశ్వాస తీర్మానం తెచ్చారని విపక్షాలను విమర్శించారు. దేశ ప్రజలు, పార్లమెంటుకు నరేంద్ర మోదీపై పరిపూర్ణ విశ్వాసం ఉందని ఆయన భరోసా వ్యక్తం చేశారు.  స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎక్కువ మంది ప్రజల అభిమానాన్ని చూరకొన్న ప్రభుత్వం మోదీ ప్రభుత్వం మాత్రమేనని చెప్పారు. అత్యంత ప్రజాదరణ కలిగిన నేత మోదీ అని, దేశం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని, ఒక్క సెలవు కూడా తీసుకోకుండా రోజుకు 17 గంటలు పనిచేస్తున్నారని గుర్తు చేశారు. 

 ప్రజలు ఆయనను విశ్వసిస్తున్నారని అమిత్ షా తెలిపారు. ఈ  సభలో ఒక వ్యక్తి 13 సార్లు రాజకీయ కెరీర్ ప్రారంభించి, 13 సార్లు విఫలమయ్యారని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి విమర్శించారు. ఇందులో ఒక సందర్భం తాను చూశానని, ఆ వ్యక్తి బుందేల్‌ఖండ్‌కు చెందిన కవిత అనే పేద మహిళను కలుసుకున్నారని, అయితే ఆమెకు చేసిందేమీ లేదని, మోదీ ప్రభుత్వమే ఆమెకు ఇల్లు, రేషన్, విద్యుత్ సౌకర్యం కల్పించిందని చెప్పారు.

ప్రధాని మోదీ అవినీతిని, కుటుంబ పాలనను, తాయిలాల రాజకీయాల్ని పారద్రోలాలని అంటుంటే విపక్షాలు మాత్రం క్విట్ ఇండియా అంటున్నాయని అమిత్ షా విమర్శించారు. దేశ పురోగతి వైపు వెళ్తున్న ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే ఈ తీర్మానాన్ని తీసుకొచ్చారని షా ఆరోపించారు. నరేంద్ర మోదీ అవినీతి, రాజవంశ రాజకీయాలు, బుజ్జగింపులను కూల్చివేసి, పనితీరు రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు.
 
ఈ అవిశ్వాస తీర్మానం దేశంలోని ప్రతిపక్షాల నిజస్వరూపాన్ని బయటపెడుతుందని అమిత్ షా ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అవినీతికి పాల్పడటం యూపీఏ గత చరిత్ర అని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న పథకాలను అమిత్ షా ప్రస్తావించారు.  మణిపూర్‌లో జరిగింది పరిస్థితుల ద్వారా ప్రేరేపణకు గురైన జాతిపరమైన హింసాకాండ అని, దానిని రాజకీయ అంశంగా మార్చవద్దని అమిత్‌ షా కోరారు. మణిపూర్‌లో హింసకు సుదీర్ఘ చరిత్ర ఉందని చెబుతూ మణిపూర్‌లో హింసను వీడమని కుకీలు, మైతేయిలను చేతులెత్తి ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
పార్లమెంట్‌ మొదటి రోజు నుంచీ తాను చర్చకు సిద్ధంగానే ఉన్నానని, కానీ ప్రతిపక్షాలే అందుకు సిద్ధంగా లేవని ధ్వజజమెత్తారు. తన స్పందనకు వారు సంతృప్తిగా లేకపోతే వారు ప్రధానిని మాట్లాడమన్నా అర్థం ఉండేదని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఈశాన్య ప్రాంతాల్లో దాదాపు 50 సార్లు పర్యటించారని చెబుతూ మణిపూర్‌ ఘటనలు జరుగుతున్నప్పుడు ప్రధాని తనను ఒకరోజు తెల్లవారు జామున 4.30 గంటలకు నిద్ర లేపారని, మరో రోజు 6.30 గంటలకు ఫోన్‌ చేశారని తెలిపారు. 
 
ఈశాన్య ప్రాంతాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు మోదీ ఎన్నో ప్రయత్నాలు చేశారని చెప్పారు. అల్లర్లు జరగడం దేశంలో ఇదే ప్రథమం కాదని, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హయాంలో అత్యధిక సంఖ్యలో మతకల్లోలాలు జరిగాయని గుర్తు చేశారు. రాహుల్‌ మణిపూర్‌లో చేసింది నాటకమని, హెలికాప్టర్‌లో వెళ్లమని చెప్పినా వెళ్లకుండా మూడు గంటలు ఉండి వచ్చారని మండిపడ్డారు.
 
రైతుల రుణాలను మాఫీ చేస్తామని యూపీఏ చెబుతూనే ఉందని పేర్కొంటూ కేవలం రుణాలు మాఫీ చేయడంపైనే తమకు నమ్మకం లేదని,  కానీ రుణం తీసుకోనవసరం లేని వ్యవస్థను రూపొందించడంలో తమకు విశ్వాసం ఉందని తెలిపారు. మీరు పథకాలను తయారు చేశారు కానీ వాటిని అమలు చేయరని విపక్ష ఇండియా కూటమిపై అమిత్ షా ఆరోపణలు గుప్పించారు. 
 
ఇప్పుడు మీరు జీఎస్టీని తొలగించారని, డీబీటీని అమలు చేశారని, పేదరికాన్ని తగ్గించారని మాపై ఆరోపణలు చేయొచ్చని, కానీ వీటన్నింటిని తాము సాధించామని స్పష్టం చేశారు. మీరు అన్నీ చెప్పారని, కానీ తాము చేసి చూపించామని విపక్షాలకు అమిత్ షా చురకలు అంటించారు.