బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఎవరికి ఓటేసినా ఒకటేనని, మజ్లిస్ పార్టీకి జైకొట్టినట్టేనని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు తీవ్రంగా కృషిచేస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటును చీల్చి వారికి లబ్ధి చేకూర్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
ఈ రెండు పార్టీలకు ఏకైక ఎజెండా బీజేపీని ఓడించడమేనని సూత్రీకరించారు. కేవలం మీడియా ముందు ఒకరినొకరు తిట్టుకుంటున్నారని, కానీ తెరవెనుక మాత్రం కలిసే పనిచేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ మూడు పార్టీల నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.
ఈ మధ్య తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ బీజేపీని ఓడించేందుకు, బీజేపీ వ్యతిరేక కూటమితో కలిసి పోరాడతామని అన్నారని, తద్వారా తమ బంధాన్ని బయటపెట్టారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో కీలకంగా ఉంటామని కేటీఆర్ చెప్పడం వెనుక ఉద్దేశం అదేనని, కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణంలో చేరాలని బీఆర్ఎస్ ఆలోచిస్తోందని వెల్లడించాయిరు. ఆ మూడు పార్టీలూ ఒక్కటేనని చెప్పేందుకు ఇదొక ఉదాహరణ మాత్రమేనని చెప్పారు.
కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ మజ్లిస్ తమకు మిత్రపక్షమని, తమది సెక్యులర్ పక్షమంటూ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మజ్లిస్ పార్టీ ‘సెక్యులర్ పార్టీ’ అని సర్టిఫికెట్ ఎలా ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 15 నిమిషాలు సమయం ఇస్ ఏం చేస్తామో చూడండి అన్న పచ్చి మతోన్మాదిని పక్క సీట్లో కూర్చోబెట్టుకుని వారితో దోస్తీ చేస్తున్న మీది ‘సెక్యులర్’ పార్టీ ఎలా అవుతుందని ప్రశ్నించారు.
అలాంటి పార్టీతో దోస్తీ ఎందుకు చేస్తున్నరో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి నిలదీశారు. మజ్లిస్ ను పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీయేనని, ఇప్పుడు బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య దోస్తీ కోసం మధ్యవర్తిత్వం మజ్లిస్ పార్టీ మధ్యవర్తిత్వం చేస్తోందని ఆయన విమర్శించారు. వీళ్లంతా ఒకరికొకరు సహకరించుకుంటున్న వైనాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ హయాంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో నాటి టీఆర్ఎస్ మంత్రి పదవులు అనుభవించిందని గుర్తుచేశారు. స్వయానా ముఖ్యమంత్రి కేసీఆరే మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారని చెప్పారు. కాంగ్రెస్ – బీఆర్ఎస్ – మజ్లిస్ పార్టీలు ఒక్కటే అని తాజా పార్లమెంట్ సమావేశాలు సైతం నిరూపిస్తున్నాయని తెలిపారు. పార్లమెంటులో కలిసే మాట్లాడుతున్నారని, కలిసే అవిశ్వాస తీర్మానం పెట్టారని ధ్వజమెత్తారు.
తెలంగాణలో 2014లో 22 మంది కాంగ్రెస్ నుంచి గెలిస్తే 15 మంది టీఆర్ఎస్ గడీలోకి చేరారని, రెండోసారి.. 2018లో 19 స్థానాల్లో కాంగ్రెస్ గెలిస్తే 12 మంది గులాబీ కండువా కప్పుకున్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు పిలిపించి భారీ బైక్ ర్యాలీ, కార్ ర్యాలీ నిర్వహించలేదా? అని ప్రశ్నించారు.
More Stories
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
చెన్నమనేని జర్మనీ పౌరుడే…తేల్చిచెప్పిన హైకోర్టు
చైనా జలవిద్యుత్ డ్యామ్ లతో 12 లక్షల మంది టిబెటన్ల నిరాశ్రయం