హాకీలో పాక్ ను చిత్తుగా ఓడించిన భారత్

ఏషియన్‌ హాకీ చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ గెలుపు జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరైనా గెలుపే లక్ష్యంగా దూసుకెళుతున్న టీమ్‌ఇండియా..టైటిల్‌ దక్కించుకునేందుకు మరింత చేరువైంది. బుధవారం ఆసక్తికరంగా సాగిన గ్రూప్ స్టేజ్ ఆఖరి మ్యాచ్‍లో భారత్‌ 4-0 తేడాతో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. 
 
సొంతగడ్డపై అభిమానుల మద్దతును తమకు అనుకూలంగా మలుచుకుంటూ టీమ్‌ఇండియా ఆది నుంచే దూకుడు ప్రదర్శించింది.
ఇప్పటికే సెమీ ఫైనల్‍కు అర్హత సాధించిన భారత్ ఈ విజయంతో మరింత ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంది. లీగ్ స్టేజ్ పాయింట్ల పట్టికలో టాప్‍లో నిలిచింది. 
ఇండియా చేతిలో ఓడిన పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత కెప్టెన్ హర్మన్‍ప్రీత్ సింగ్ (15వ నిమిషం, 23వ నిమిషం) రెండు గోల్స్ చేసి అదరగొట్టాడు. జుగ్‍రాజ్ సింగ్ (36వ నిమిషం), అక్షదీప్ సింగ్ (55వ నిమిషం) చెరో గోల్ బాదారు. దీంతో టీమిండియా 4-0 తేడాతో పాక్‍పై ఘన విజయం సాధించింది.
 
ఈ విజయంతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, ఒక డ్రాతో భారత్‌ 13 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఈ నెల 11న జరిగే సెమీస్‌లో జపాన్‌తో భారత్‌ తలపడుతుంది. ఈ మ్యాచ్‍లో ఆరంభం నుంచి పాకిస్థాన్‍పై భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. 
మ్యాచ్ 15వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను భారత్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ గోల్‍గా మలిచాడు.
పాక్ గోల్ కీపర్ అక్మల్ హుసేన్‍కు ఎమడ వైపుగా బాది బంతిని గోల్ పోస్టులోకి పంపాడు. దీంతో టీమిండియా ఖాతా తెరిచింది. 23వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను కూడా గోల్ చేశాడు హర్మన్.  ఈసారి పాక్ గోల్ కీపర్ కాళ్ల మధ్యలో నుంచి బంతిని పంపాడు. దీంతో పాకిస్థాన్ పూర్తిగా ఆత్మరక్షణ ధోరణిలో ఆడింది. ఏ మాత్రం కోలుకోలేకపోయింది. దీంతో హాఫ్ టైమ్ నాటికి ఇండియా 2-0 ఆధిక్యంతో నిలిచింది.
రెండో అర్ధభాగంలోనూ భారత్ పూర్తిగా దూకుడు చూపింది. 36వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను గోల్ చేశాడు భారత ప్లేయర్ జుగ్‍రాజ్ సింగ్.  43వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను పాక్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. 55వ నిమిషంలో అక్షదీప్ సింగ్ గోల్ చేయడంతో భారత్ 4-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మొత్తంగా ఈ మ్యాచ్‍లో పాకిస్థాన్‍ను చిత్తుగా ఓడించింది. ఆత్మ విశ్వాసంతో ఆసియా చాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‍లో తలపడనుంది.