పెండింగ్ బిల్లులకు కర్ణాటకలో 15 శాతం కమిషన్

 
40 శాతం కమీషన్‌ అంటూ బిజెపి ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించి కర్ణాటక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై  మూడు నెలలు కాకుండానే అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెండింగ్‌ బిల్లుల విడుదలకు ఉప ముఖ్యమంత్రి శివకుమార్‌ తమను 10 నుంచి 15 శాతం కమీషన్‌ అడుగుతున్నారని బృహత్‌ బెంగళూర్‌ మహానగర పాలిక (బీబీఎంపీ) కాంట్రాక్టర్ల సంఘం సంచలన ఆరోపణలు చేసింది. 
 
ఈ మేరకు వారు గవర్నర్‌ తావర్‌చంద్‌ గెహ్లాట్‌, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఫిర్యాదు చేశారు. శివకుమార్‌ ఆర్థిక మంత్రే కాకుండా బెంగళూర్‌ నగర అభివృద్ధి శాఖలను కూడా నిర్వహిస్తున్నారు. కమీషన్లు లేకుండా బిల్లులు అయినా విడుదల చేయించండి,. లేనిపక్షంలో తమను కారుణ్య మరణాలకైనా అనుమతించండని కాంట్రాక్టర్ల సంఘం డిమాండ్‌ చేయడం కర్ణాటక సర్కారును కుదిపేస్తున్నది. 
 
అవినీతిరహిత పాలన అందిస్తామని కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పెండింగ్‌ బిల్లుల క్లియరెన్స్‌కు 10 నుంచి 15 శాతం కమీషన్‌ అడగటమేనా? అవినీతిరహిత పాలన అని కాంట్రాక్టర్ల సంఘం నిలదీసింది. గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత సంఘం నేతలు మీడియాతో మాట్లాడారు. పెండింగ్‌ బిల్లుల మంజూరుకు తమ వద్ద డబ్బులు లేవని ప్రభుత్వం అబద్ధం ఆడుతున్నదని సంఘం అధ్యక్షుడు మంజునాథ్‌ ఆరోపించారు. తమకు బకాయిపడింది రూ.675 కోట్లు కాగా బెంగళూర్‌ మహానగర పాలక వద్ద రూ.1500 కోట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. 
 
బిల్లులు చెల్లించాలంటే సంబంధిత మంత్రి అయిన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు 10 నుంచి 15 పర్సేంటేజి ఇవ్వాలని అధికారులు అంటున్నారని వారు ఆరోపించారు. ఈ విషయంలో గవర్నర్‌ జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరినట్లు వారు వివరించారు. అయితే, కాంట్రాక్టర్ల సంఘం చేసిన ఆరోపణ పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైందిగా డీకే శివకుమార్‌ ఖండించారు. ఈ ఆరోపణల వెనుక బీజేపీ, జేడీఎస్‌ నాయకుల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. జరిగిన పనులు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించకుండా బిల్లులు ఎలా విడుదల చేస్తామని ఆయన ప్రశ్నించారు. పెండింగ్‌ బిల్లులు పరిశీలించి అవి సక్రమంగా ఉన్నాయో లేవో నివేదిక ఇవ్వాల్సిందిగా లోకాయుక్తను కోరనున్నట్టు శివకుమార్‌ మీడియాకు తెలిపారు. తనపై ఆరోపణలు చేయడానికి ముందు కాంట్రాక్టర్ల సంఘం నాయకులు ప్రతిపక్ష నాయకులను కలిశారని, వారి ప్రోద్బలంతోనే తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇలా ఉండగా, వ్యవసాయ మంత్రి ప్రతి నెలా రూ 8 నుండి రూ 10 లక్షల ఆమేరకు ముడుపులు చెల్లించామని అడుగుతున్నారని ఆరోపిస్తూ మండ్య జిల్లాలోని ఏడుగురు ఆ శాఖకు చెందిన జాయింట్ డైరెక్టర్లు గవర్నర్ కు ఫిర్యాదు చేయగా, ఆయన దానిపై దర్యాప్తు జరిపి తగు చర్య తీసుకోమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గత వారం లేఖ వ్రాయడం ఇప్పటికే రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి.