సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన జ‌గ‌న్

రాష్ట్రంలో సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా జ‌గ‌న్ మార్చారు అని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. పంచాయతీల్లో నిధులు లేక అప్పులు చేసి సర్పంచ్ లు పని చేస్తున్నార‌ని చెబుతూ సర్పంచ్ లకు నిధులు రాకపోవడంతో ఆత్మహత్యలు చేసుకున్న పాపం ఈ ప్రభుత్వానిదే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
స‌ర్పంచ్ ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ గురువారం రాష్త్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ ల వద్ద బిజెపి శ్రేణులు మహా ధర్నా కార్యక్రమాలు చేపట్టాయి.

ఏపీలో నాలుగేళ్లుగా పొత్తులో ఉన్నప్పటికీ ఉమ్మడిగా  బీజేపీ-జనసేన పార్టీలు తొలిసారి ఓ వేదికపై దర్శనమిచ్చాయి. ఒంగోలు కలెక్ట‌రేట్ వ‌ద్ద బీజేపీ తలపెట్టిన మహాధర్నాలో పురందేశ్వరి పాల్గొంటూ ఈ ప్రభుత్వంలో చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా చేసిన పనులకు నిధులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
రాజ్యాంగ బద్దమైన సర్పంచ్ వ్యవస్థని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది అని ఆమె విమర్శలు గుప్పించారు. కేంద్రం పంచాయతీలకు ఇచ్చే నిధులను జగన్ సర్కార్ పక్కదారి పట్టిస్తుందని ఆమె ఆరోపించారు. సర్పంచ్ లకు అన్యాయం చేస్తున్నారని బీజేపీ గళం విప్పిన తర్వాత రూ 1,000 కొట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు చెప్పారని ఆమె తెలిపారు. 
 
రూ. 600 కోట్ల విద్యుత్ బిల్లుల కోసం ఆపడం దారుణమ‌ని ఆమె మండిపడ్డారు. మహాత్మా గాంధీని కూడా అవమాన పరిచే విధంగా జగన్ ప్రభుత్వం పని చేస్తుంద‌ని ఆమె ధ్వజమెత్తారు. వైసీపీ సర్పంచ్ లు కూడా బయటకు వచ్చి ప్రభుత్వంకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నార‌ని చెబుతూ సర్పంచ్ ల ఆందోళనకి జగన్ ఏం సమాధానం చెబుతారని పురందేశ్వరి ప్రశ్నించారు.  సర్పంచ్‌లు ఆందోళనకు జనసేన మద్దతు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్‌కు పురందేశ్వరి కృతజ్ఞతలు తెలియజేశారు.
వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఎన్నో
 
గత నాలుగు సంవత్సరాల నుంచి వైసీపీ చేస్తున్న అరాచకాలు చాలా ఉన్నాయని, అందులో పంచాయతీరాజ్ వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలను ఎక్కువుగా ఉన్నాయని మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి విమర్శింఛారు. గ్రామ పంచాయితీ నిధులు, సర్పంచుల హక్కుల పరిరక్షణకై వైసీపీ ప్రభుత్వంపై విజయవాడ ధర్నా చౌక్‌లో మహా నిరసన చేపట్టారు. 
 
నిరసనలో మాజీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, సర్పంచ్ ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైవిబి రాజేంద్ర ప్రసాద్, జనసేన నేత పోతిన మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజనాచౌదరి మాట్లాడుతూ ఇలాంటి జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థను అస్తవ్యస్తంగా చేస్తారని రాజ్యాంగం రాసినప్పుడు తెలియలేదని ధ్వజమెత్తారు. 
 
రాష్ట్రానికి వచ్చిన కేంద్ర నిధులు అనేక విధాలుగా దారి మళ్లింపులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పంచాయతీ వ్యవస్థకు సమాంతరంగా వాలంటీర్ వ్యవస్థను పెట్టారని అంటూ ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించిన ప్రైవేట్ వ్యవస్థ అంటూ మండిపడ్డారు.
తిరుపతిలో అరెస్టులు
 
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డితో పాటు బిజెపి, జనసేన పార్టీలకు చెందిన నేతలు తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన చేస్తూ రాస్తారోకో చేసేందుకు ప్రయత్నించారు.  రాస్తారోకోను అడ్డుకున్న పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం పోలీస్‌స్టేషన్‌లోనే నేతలు ధర్నాను కొనసాగిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా ఆనంద్‌తో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన సహా మరో 50 మంది నేతలను పోలీసులు అదుపులోకి తీనారు.
 
ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుత ‘‘మేమేమైనా ఉగ్రవాదులమా? పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలను దెబ్బతీయాలని చూస్తున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఏపీలోని సర్పంచ్‌ల ఖాతాలకు కేంద్ర ప్రభుత్వం రూ 8 వేల కోట్ను జమచేసింది. సర్పంచ్‌లకు కేటాయించిన నిధులను సీఎం జగన్ పక్కదారి పట్టించారు. 13 వేల మంది సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు’’ అంటూ విమర్శించారు.