
‘మోదీ ఇంటి పేరు’ పరువు నష్టం కేసులో ఊరట పొంది కొన్ని రోజులు కూడా గడవక ముందే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. లోక్ సభ నుంచి వెళ్లిపోతూ ఆయన మహిళా ఎంపీల వైపు చూస్తూ `ఫ్లయింగ్ కిస్’ ఇచ్చారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు.
మహిళలంటే ఇష్టపడనివారు మాత్రమే ఇటువంటి పనులు చేయగలరని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీలో, ఆయన కుటుంబంలో ఉన్న పురుషాహంకారం మరోసారి ఆమె మండిపడ్డారు. సభా మర్యాదలు పాటించకుండా, మహిళా సభ్యులు కూడా ఉన్న సభలో అమర్యాదగా, పురుషాహంకారంతో రాహుల్ గాంధీ వ్యవహరించారని, సభలో గాలిలో ముద్దులు విసిరి, పార్లమెంటు ప్రతిష్టను మంటగలిపారని ఆమె విమర్శించారు.
ఇలాంటి తీరు ఇంతవరకు భారత పార్లమెంటు చరిత్రలో లేదని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంపై దాదాపు 21 మంది మహిళా ఎంపీలు స్పీకర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఆరోపణలలో వాస్తవాన్ని సరిచూసేందుకు అధికారులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా బుధవారం లోక్ సభలో పెను దుమారం రేగింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, క్షమాపణ చెప్పాలని ఆయనను డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, హింసాత్మక ఘర్షణలు జరుగుతున్న మణిపూర్ రాష్ట్రంలో తాను పర్యటించానని చెప్పారు. తాను సహాయక శిబిరాలకు వెళ్లానని, దురాగతాలను ఎదుర్కొన్న మహిళలతో తాను మాట్లాడానని తెలిపారు. కుమారుల మృతదేహాల వద్ద ఉన్న తల్లులతో మాట్లాడానని చెప్పారు. భయానక సంఘటనల గురించి చెప్పేటపుడు ఆ మహిళలు స్పృహ కోల్పోయారని చెప్పారు.
బీజేపీ ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించిందని ఆరోపిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం ఆ రాష్ట్రంలో పర్యటించలేదని ఆరోపించారు. మణిపూర్ మహిళల బాధలు బీజేపీకి అర్థం కావడంలేదని చెబుతూ భారత దేశ ఆత్మను ప్రభుత్వం హత్య చేసిందని ఆరోపించారు. తన తల్లి పార్లమెంటులో ఉన్నారని, మణిపూర్‌లో భారత మాతను హత్య చేశారని ఆరోపించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని పరోక్షంగా రావణాసురుడితో పోల్చుతూ రావణాసురుడు మేఘనాథుడు, కుంభకర్ణుడు చెప్పిన మాటలనే వినేవాడని, మోదీ కూడా ఇద్దరి మాటలనే వింటారని, వారిద్దరూ అమిత్ షా, అదానీ అని దుయ్యబట్టారు. బీజేపీ నేతలు దేశభక్తులు కాదని, దేశ ద్రోహులు అని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలతో అధికార పక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో గందరగోళం ఏర్పడింది.
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, మణిపూర్ కోసం కాంగ్రెస్ చేసినదేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, వారసత్వ రాజకీయాలు భారత దేశాన్ని విడిచిపెట్టిపోవాలని ఆమె స్పష్టం చేశారు.
‘‘మీరు ఇండియా కాదు’’ అని దుయ్యబట్టారు. ‘‘మీది ఇండియా కాదు, అవినీతికి ప్రతిరూపం’’ అని ప్రతిపక్ష కూటమి పేరును ఉద్దేశించి ఆరోపించారు. స్మృతి ఇరానీ మాట్లాడుతుండగానే రాహుల్ గాంధీ లోక్ సభ నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు. ఆయన సభ నుంచి వెళ్లిపోతూ `ఫ్లయింగ్ కిస్’ ఇచ్చారని స్మృతి ఇరానీ ఆరోపించారు.
అయితే ఈ సంఘటన కెమెరాలలో చిత్రీకరణ అయినట్లు కనిపించలేదు. ఈ ఆరోపణల్లో వాస్తవాలను తెలుసుకునేందుకు అధికారులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
‘‘ఓ విషయంలో నాకు చాలా అభ్యంతరం ఉంది. నా కన్నా ముందు మాట్లాడిన వ్యక్తి సభ నుంచి వెళ్లిపోతూ అసభ్యకరంగా ప్రవర్తించారు. మహిళలంటే ఇష్టపడనివారు, మహిళల పట్ల వ్యతిరేక భావం కలవారు మాత్రమే ఈ విధంగా మహిళా సభ్యులు ఆశీనులయ్యే పార్లమెంటులో ఫ్లయింగ్ కిస్ ఇవ్వగలరు. హుందాతనంలేని ఇటువంటి ప్రవర్తన మన దేశ పార్లమెంటులో మునుపెన్నడూ కనిపించలేదు’’ అని స్మృతి ఇరానీ ఆరోపించారు.
మణిపూర్ విడిపోలేదని, మణిపూర్ భారతదేశంలో అంతర్భాగమే అని ఆమె స్పష్టం చేశారు. దేశంలో ఎంతో మందిని హత్య చేసిన చరిత్రగల కాంగ్రెస్ భారత దేశాన్ని హత్య చేసినట్లు చెప్పడంలో అర్థం లేదని ఆమె ధ్వజమెత్తారు. దేశంపట్ల తమకు చిత్తశుద్ధి ఉందని, కాంగ్రెస్ పార్టీకి అటువంటి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.
మణిపూర్‌ను ఎవరూ విభజించలేరని, ముక్కలు చేయలేని స్పష్టం చేశారు. మణిపూర్ సహా దేశంలో మహిళల కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే చేస్తున్న కృషిని వివరించారు.
More Stories
ఒకే దేశం- ఒకే ఎన్నిక జేపీసీ గడువు పొడిగింపు!
రూ. 1 లక్ష కోట్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తొలి బడ్జెట్
నాపై సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లుంది