జ్ఞానవాపిలో త్రిశూలం.. కొన్ని విగ్రహ శకలాలు!

జ్ఞానవాపి మసీదులో శుక్రవారం పునఃప్రారంభమైన సాంకేతిక సర్వేలో మూడు ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఎఎస్ఐ) బృందాలు శనివారం సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగించాయి. ఈ సందర్భంగా కొన్ని విగ్రహ శకలాలను ఆవరణలోని వ్యర్థాల నుంచి సర్వే బృందం సేకరించింది. 
ఇన్నాళ్లూ సహాయ నిరాకరణ చేసిన అంజుమన్‌ ఇంతెజామియా మసీదు కమిటీ శనివారం నాటి సర్వేకి పూర్తిగా సహకరించింది.
గతంలో ఇవ్వడానికి నిరాకరించిన పలు తాళాలను కూడా ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సర్వేకు సహకరిస్తున్నామని ప్రకటించింది. ఇక, శుక్రవారం నిర్వహించిన సర్వేలో భాగంగా జ్ఞానవాపి ఆవరణలోని స్తంభాలు, గోడలు, గోపురాలపై ఉన్న గుర్తులను క్షుణ్ణంగా పరిశీలించారు. గోడలు, స్తంభాలపై చెక్కి ఉన్న స్వస్తిక్‌ చిహ్నం, గంట, పువ్వు వంటి ఆకారం, త్రిశూలం బొమ్మలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తీశారు.
 
గతంలో హిందూ దేవాలయంగా ఉన్న నిర్మాణాన్ని కూల్చి, అక్కడ మసీదును నిర్మించారన్న వాదన నేపథ్యంలో ఈ సర్వే జరుగుతోంది. ప్రస్తుతం మసీదులోని సెంట్రల్ డోమ్ లో ఇమేజింగ్, మ్యాపింగ్ విధానాలతో ఏఎస్ఐ అధికారులు సర్వే చేస్తున్నారు. అలాగే, డోమ్ లోపల ఉన్న ఒక తేహ్ ఖానా ను కూడా పరిశీలిస్తున్నారు. కానీ, మరో బేస్ మెంట్ లోపలికి ఇంకా వెళ్లలేదు. 
 
జ్ఞానవాపి మసీదు లో శనివారం కూడా సర్వే కొనసాగింది. మధ్యాహ్నం ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి వీలుగా కొద్ది సేపు సర్వేను నిలిపివేశారు. మసీదు నిర్మాణానికి ఎలాంటి హాని కలగకుండా, ముస్లింల ప్రార్థనలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సర్వే జరపాలని ఏఎస్ఐని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. 
 
మసీదులో నిర్వహిస్తున్న సర్వే లో ప్రధానంగా మసీదు ప్రాంగణం, ప్రార్థన జరిగే ప్రదేశం, వజూఖానాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.  ఈ సర్వేలో ఇప్పటివరకు ఎలాంటి హిందూ విగ్రహాలు లభించలేదని, కానీ, కొన్ని విగ్రహ శిధిలాలను ఏఎస్ఐ అధికారులు గుర్తించారని హిందూ వర్గం తరఫు న్యాయవాదులు వెల్లడించారు. 
 
సర్వే పూర్తయ్యే సమయానికి స్పష్టమైన విగ్రహాలను కచ్చితంగా గుర్తిస్తారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శివలింగం ఉందని భావిస్తున్న వజుఖానాలో విగ్రహాలు లభిస్తాయని ఆశిస్తున్నామని న్యాయవాది సుధీర్ త్రిపాఠీ వెల్లడించారు. 17వ శతాబ్దంలో అప్పటికే నిర్మించి ఉన్న దేవాలయాన్ని కూల్చి మసీదు ను నిర్మించారనడానికి కచ్చితమైన ఆధారాలున్నాయని చెప్పారు.
 
కాగా, జీపీఆర్‌ (గ్రౌండ్‌ పెనట్రేటింగ్‌ రాడార్‌) టెక్నాలిజీ అనే సాంకేతిక పరిజ్ఙానాన్ని ఉపయోగించి మసీదు భూగర్భంలో ఏవైనా నిర్మాణాలు ఉన్నాయా? అనే విషయాన్ని సర్వే బృందం అధ్యయనం చేస్తుందని ఏస్‌ఐ మాజీ అధికారి ఒకరు చెప్పారు.