508 రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు ప్రధాని శంకుస్థాపన

అమృత్ భారత్ స్టేషన్ లో భాగంగా రద్దీగా ఉండే రైల్వేస్టేషన్ల ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. రూ.24,470 కోట్లతో రైల్వే స్టేషన్లలో పునరాభివృద్ధి పనులకు ఆదివారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రదాని మోదీ శంకుస్థపన చేశారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ “అభివృద్ధి దిశగా దేశం పరుగులు పెడుతోంది. దేశ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాం. 508 రైల్వేస్టేషన్ల అభివృద్ధికి రూ.25వేల కోట్లు కేటాయించాం. రైల్వే స్టేషన్ల వద్ద షాపింగ్ కాంప్లెక్స్, గేమింగ్ జోన్ లు ఏర్పాటు చేస్తాం. అభివృద్ధి చేసిన తర్వాత ఈ స్టేషన్లు మల్టీ మోడల్ హబ్ గా మారతాయి” అని పేర్కొన్నారు.

రైల్వే రంగంలో ఈ అభివృద్ధి విప్లవాత్మకంగా ఉంటుందని మోదీ తెలిపారు. ప్రజలకు మరింత సౌకర్యవంతమైన జీవితం లభిస్తుందని చెప్పారు. స్థానిక సంస్కృతులు, వారసత్వం, కళలను దృష్టిలో ఉంచుకొని, అందుకు తగ్గట్టుగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరుగుతుంది అని మోదీ తెలిపారు.

‘‘రైల్వే స్టేషన్ల వద్ద షాపింగ్‌ కాంప్లెక్స్‌, గేమింగ్‌ జోన్‌లు ఏర్పాటు చేయనున్నాం. అభివృద్ధి చేశాక ఈ స్టేషన్లు మల్టీ మోడల్ హబ్‌గా మారతాయి. అభివృద్ధి దిశగా దేశం పరుగులు పెడుతోంది’’ అని ప్రధాని తెలిపారు. ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకారం రైల్వేస్టేషన్లను సిటీ సెంటర్లుగా తీర్చిదిద్దుతారు. ప్రతీ సిటీకీ ప్రారంభం, చివర్లో రెండేసి స్టేషన్లను అభివృద్ధి చేస్తారని తెలిపారు. ఇందుకు సంబంధించి మాస్టర్ ప్లాన్స్ సిద్ధమవుతున్నాయి.

508 స్టేషన్లూ  27 రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తున్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్‌లో 55, బీహార్‌లో 49, మహారాష్ట్రలో 44, బెంగాల్‌లో 37, మధ్యప్రదేశ్‌లో 34, అసోంలో 32, ఒడిశాలో 25, పంజాబ్‌లో 22, గుజరాత్‌లో 21, తెలంగాణలో 21, జార్ఖండ్‌లో 20, ఆంధ్రప్రదేశ్‌లో 18, తమిళనాడులో 18, హర్యానాలో 15, కర్ణాటకలో 13 ఉన్నాయి. ఈశాన్య ప్రాంతంలోని మేఘాలయ, నాగాలాండ్‌లో ఒక్కో స్టేషన్‌ని అప్‌గ్రేడ్ చేస్తారు.

రానున్న రెండేళ్లలో ఈ రైల్వేస్టేషన్లన్నింటినీ ప్రపంచ స్థాయికి చేర్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ రైల్వేస్టేషన్లలో రూఫ్ ప్లాజాలను నిర్మిస్తారు. అంటే ట్రాక్‌పై పైకప్పు ఉంటుంది. ఇది కాకుండా, కొత్త రైల్వేస్టేషన్లలో పూర్తి సౌకర్యాలతో కూడిన రన్నింగ్ రూమ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

తెలంగాణ రాష్ట్రంలోని నాంపల్లి రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనుల్లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, భద్రాచలం రోడ్డు, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట, ఖమ్మం, మధి, మహబూబ్ నగర్ మహబూబాబాద్ , మలక్ పేట, మల్కాజిగిరి, నిజామాబాద్, రామగుండం, తాండూరు, రాయగిరి, జహీరాబాద్ రైల్వేస్టేషన్లను అభివృద్ది చేయనుంది ప్రభుత్వం. తెలంగాణలోని 21 రైల్వేస్టేషన్లకు రూ. 894.09 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని 18 రైల్వే స్టేషన్లకు రూ.453.50 కోట్ల వ్యయంతో రైల్వేశాఖ అభివృద్ధి చేయనుంది.