ఇమ్రాన్ పార్టీ ఎన్నికల గుర్తుకు అనర్హత?

పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన పార్టీ పాకిస్తాన్‌ తెహ్రీక్‌ -ఎ-ఇన్సాఫ్‌(పిటిఐ)ని ఎన్నికల గుర్తు పొందేందుకు అనర్హతమైనదిగా ప్రకటించే అవకాశం ఉందని స్థానిక మీడియా తెలిపింది. 

శుక్రవారం తమ ఎదుట హాజరుకావాలని పిటిఐ చైర్మన్‌ ఇమ్రాన్‌ఖాన్‌కి బుధవార్లం ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ పాకిస్తాన్‌ (ఇసిపి) సమన్లు జారీ చేసింది. ఎన్నికల చట్టం, 2017 లోని సెక్షన్‌ 215 (5) ప్రకారం, పార్టీలో అంతర్గత ఎన్నికలు నిర్వహించడంలో విఫలమైనందున, భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్నికల గుర్తును పొందేందుకు అనర్హమైనదిగా ప్రకటించనున్నట్లు ఇసిపి హెచ్చరించింది.

పార్టీ రాజ్యాంగం ప్రకారం 2021 జూన్‌లో పిటిఐలో అంతర్గత ఎన్నికలు నిర్వహించాల్సి వుంది. ”ఎన్నికల చట్టం, 2017లోని సెక్షన్లు 208, 209 మరియు 215 కింద నిర్ణయించిన గడువులోపు పార్టీ అంతర్గత ఎన్నికలు నిర్వహించాల్సిందిగా పిటిఐకి గుర్తు చేస్తున్నాము” అని ఆ నోటీసుల్లో పేర్కొంది. 

2022 జూన్‌ 13 లేదా (పొడిగించిన తేదీ) మరోసారి తదుపరి పొడిగింపు అనుమతించబడదని పేర్కొంటూ గత ఏడాది మేలో పిటిఐకి తుది నోటీసులు జారీ చేసింది. ఎన్నికల చట్టంలోని సెక్షన్‌ 209 (1) ప్రకారం.. నమోదైన ప్రతి రాజకీయ పార్టీ చట్టం ప్రకారం అంతర్గత ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇసిపికి ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి వుంటుందని స్థానిక మీడియా తెలిపింది. 

ఈ నిబంధనను అమలు చేయని రాజకీయ పార్టీని ఎన్నికల గుర్తు పొందేందుకు అనర్హమైనదిగా ప్రకటించనుంది. ఈ ఏడాది చివరలో జరగనున్న సాధారణ ఎన్నికలకు ముందు ఎన్నికల గుర్తుల కేటాయింపు కోసం తమ దరఖాస్తులను సమర్పించాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీలను ఇసిపి ఆదేశించింది.