హర్యానాలో హింసాకాండ.. దోషులపై కఠిన చర్యలు

హర్యానాలో మతఘర్షణల నేపథ్యంలో హింసాకాండకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపడతామని, దోషులను ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. హింసకు పాల్పడిన 116 మందిని అరెస్ట్ చేశామని, 90 మందిని నిర్బంధం లోకి తీసుకున్నామని చెప్పారు. నుహ్‌లో స్పెషల్ బెటాలియన్‌ను రంగం లోకి దింపామని చెప్పారు. బాధితులకు పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. ఆస్తులు నష్టపోయిన బాధితులకు పరహారాన్ని అల్లర్లకు పాల్పడినవారే చెల్లిస్తారని చెప్పారు. 

అల్లర్లు చెలరేగడానికి కారణమైన మోను మనేసర్, వీహెచ్‌పీ యాత్రలో పాల్గొన్నాడా లేదా అన్నది సీసీటీవీ ఫుటేజ్‌, కాల్‌ రికార్డ్స్‌ ద్వారా అధికారులు దర్యాప్తు చేస్తారని వెల్లడించారు.  బజరంగ్‌దళ్ నేత మనేసర్ ఎక్కడున్నారో వివరాలు వెల్లడి కాలేదని, అల్లర్లలో మోను మనేసర్ ప్రమేయం ఉంటే ఆ దిశగా విచారణ సాగుతుందని స్పష్టం చేశారు. అతనిపై రాజస్థాన్ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయడాన్ని ప్రస్తావిస్తూ అతనైపై వారెటువంటి చర్య అయినా తీసుకోవచ్చని తెలిపారు.

రెండు రోజులపాటు జరిగిన హింసలో ఇద్దరు పోలీసులతో సహా ఆరుగురు మరణించినట్లు తెలిపారు. బాధిత పోలీస్‌ కుటుంబాలకు రూ.57 లక్షల పరిహారాన్ని ప్రకటించినట్లు చెప్పారు. మరోవైపు గురుగ్రాంలో మంగళవారం రాత్రి అల్లర్లు చెలరేగడంతో ఢిల్లీ సహా జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్) అప్రమత్తమైంది. గురుగ్రాం సోహ్న సబ్‌డివిజన్‌లో అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ విద్యాసంస్థలకు బుధవారం సెలవు ప్రకటించారు.

నుహ్ ఘ‌ర్ష‌ణ‌ల‌కు వ్య‌తిరేకంగా ఢిల్లీలోని నిర్మాణ్ విహార్ మెట్రో స్టేష‌న్ వ‌ద్ద నిర‌స‌న‌ల‌కు వీహెచ్‌పీ పిలుపు ఇవ్వ‌డంతో భ‌ద్ర‌తను క‌ట్టుదిట్టం చేశారు. హ‌రియాణ హింసాకాండకు వ్య‌తిరేకంగా మ‌నేస‌ర్‌లోని బిసం దాస్ మందిర్‌లో బుధవారం సాయంత్రం మ‌హాపంచాయ‌త్‌కు వీహెచ్‌పీ, భ‌జ‌రంగ్ ద‌ళ్ పిలుపు ఇచ్చాయి. నోయిడాలో భారీ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టేందుకు హిందూ సంస్ధ‌లు స‌న్నద్ధ‌మ‌య్యాయి, నోయిడా స్టేడియం నుంచి ప్రారంభ‌మ‌య్యే నిర‌స‌న ప్ర‌దర్శ‌న ర‌జ‌నిగంధ చౌక్ వ‌ద్ద ముగుస్తుంద‌ని వీహెచ్‌పీ ప్ర‌చార క‌మిటీ చీఫ్ రాహుల్ దూబే వెల్ల‌డించారు.

విహెచ్‌పీ, బజరంగ్ దళ్ మద్దతుదారులు ఢిల్లీలో నిరసనలు చేపడుతుండటంపై అధికార యంత్రాంగానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించి, సీసీటీవీలతో గట్టి నిఘా ఉంచాలని సూచించింది. ఈ నిరసనల్లో ఎలాంటి ఉద్రిక్తతలు జరగకుండా నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. హర్యానా లో హింస చెలరేగడంతో దేశ రాజధాని నగరం లోని సున్నిత ప్రాంతాల్లో ఇప్పటికే పోలీస్‌లు భద్రతను కట్టుదిట్టం చేశారు.