అధికార, విపక్షాల తీరుపై ఓం బిర్లా మనస్థాపం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పదే వాయిదా పడుతూ ఉండటంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార, విపక్ష సభ్యులు సభా కార్యకలాపాలకు తరచూ అంతరాయం కలిగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
సభలో మంగళవారం బిల్లులకు ఆమోదం తెలిపే సమయంలో ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎడతెగకుండా సభా కార్యకలాపాలకు అంతరాయం కల్పిస్తుండటాన్ని తప్పుబట్టారు. సభా గౌరవానికి అనుగుణంగా సభ్యులు ప్రవర్తించే వరకు తాను సభకు హాజరుకాబోనని హెచ్చరించారు. ఈ హెచ్చరికకు అనుగుణంగానే ఆయన బుధవారం సభాధ్యక్ష స్థానంలో కనిపించలేదు.
 
 జులై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి సభలో మణిపూర్ అంశంపై గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మణిపూర్ అల్లర్లు, అమానుష ఘటనలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని విపక్ష నేతలు పట్టుబడుతున్నారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ కారణాలతోనే స్పీకర్ అసంతృప్తిగా ఉన్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఓం బిర్లా నిర్ణయంతో బుధవారం లోక్ సభ కార్యకలాపాలను బీజేపీ ఎంపీ కిరీట్ సోలంకి నిర్వహించారు. బుధవారం కూడా సభలో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మణిపూర్‌ అంశానికితోడు ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుకు వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. సభ్యులు శాంతియుతంగా వ్యవహరించాలని కిరీట్ కోరినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆయన సభను వాయిదా వేశారు.

ప్ర‌ధానికి ఆదేశాలు ఇవ్వ‌లేను
 
కాగా, రాజ్య‌స‌భ‌లో ఈ అంశంపై చ‌ర్చించాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేశాయి. మ‌ణిపూర్ ఇష్యూపై చ‌ర్చించాల‌ని సుమారు 60 మంది స‌భ్యులు నోటీసులు ఇచ్చారు. రూల్ 267 కింద చ‌ర్చించాల‌ని డిమాండ్ చేశారు. కానీ ఆ నోటీసుల‌ను చైర్మెన్ జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్‌ తిర‌స్క‌రించారు. ప్ర‌శ్నోత్త‌రాలు నిర్వ‌హించేందుకు చైర్మెన్ మొగ్గుచూపారు.
 
అయితే రాజ్య‌స‌భ విప‌క్ష నేత మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే మాట్లాడుతూ స‌భ‌కు ప్ర‌ధాని వ‌చ్చేలా ఆదేశాలు ఇవ్వాల‌ని చైర్మెన్‌ను కోరారు. ఆ స‌మ‌యంలో చైర్మెన్ జ‌గ‌దీప్ మాట్లాడుతూ అలాంటి దేశాల్ని చైర్ ఇవ్వ‌లేద‌ని స్పష్టం చేశారు. తాను ఆదేశాలు ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని, అది తాను చేయ‌లేనని చెప్పారు.  అయితే నోటీసుల్ని చైర్మెన్ తిర‌స్క‌రించ‌డంతో విప‌క్ష ఎంపీలు స‌భ నుంచి వాకౌట్ చేశారు. రూల్ 267 కింద మ‌ణిపూర్ అంశంపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని 58 నోటీసులు త‌న‌కు అందిన‌ట్లు ధ‌న్‌ఖ‌ర్ తెలిపారు. ఆ నోటీసుల్ని ఆమోదించ‌డం లేద‌న్నారు. 
రాష్ట్రపతి జోక్యం కోరిన ఇండియా ఎంపీలు

మరోవంక, ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు బుధవారం రాష్ట్రపతి  ద్రౌపది ముర్ముని కలిశారు. మణిపూర్ సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు మణిపూర్ పర్యటకు వెళ్లి వచ్చిన 21 మంది ఇండియా కూటమి సభ్యులు రాష్ట్రపతిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. 
 
మణిపూర్ ఘటనపై పార్లమెంట్ లో ప్రకటన చేయాలని ప్రధాని మోదీని అడగాలని ప్రతిపక్ష నేతలు రాష్ట్రపతిని కోరారు.  సమావేశం అనంతరం విపక్ష నేతలు మీడియాతో మాట్లాడుతూ మణిపూర్ సమస్యను రాష్ట్రపతికి వివరించినట్లు చెప్పారు. మణిపూర్ లో మహిళలపై జరుగుతున్న దురాగతాలను ముర్ముకు వివరించినట్లు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ మణిపూర్ లో పర్యటించి, రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రపతికి వినతిపత్రం అందించినట్లు తెలిపారు.