నూహ్‌ ఘర్షణల వెనుక భారీ కుట్ర

 
హర్యానాలోని నూహ్‌ పట్టణంలో విశ్వహిందూ పరిషత్‌ ర్యాలీ నిర్వహించిన సందర్భంగా సోమవారం రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల వెనుక భారీ కుట్ర దాగి ఉన్నదని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఒక వర్గం వాళ్లు శాంతంగా యాత్ర నిర్వహిస్తుండగా.. మరో వర్గం వాళ్లు ఆ యాత్రపై ఒక్కసారిగా దాడిచేయడం వెనుక భారీ కుట్ర ఉన్నట్లు కనిపిస్తున్నదని ఆయన స్పష్టం చేశారు.
 
ఈ ఘటన దురదృష్టకరమని, దీని ద్వారా అనేక చోట్ల ఘర్షణలు జరిగాయని చెబుతూ సోమవారం జరిగిన ఘర్షణల తర్వాత కాల్పుల్లో ఇద్దరు హోంగార్డులతో సహా మొత్తం ఐదుగురు చనిపోయారని తెలిపారు. ప్రతి ఏటా నిర్వహించే విశ్వ హిందూ పరిషత్ యాత్రను అడ్డుకొని, దాడి చేశారని పేర్కొంటూ ఈ ఘర్షణ కారణంగా ఇప్పటివరకూ 5 మంది (ఇద్దరు పోలీసులు, ముగ్గురు వ్యక్తులు) ప్రాణాలు కోల్పోయారని, నుహ్‌కి చెందని వ్యక్తులు ఈ దాడి వెనుక ఉన్నారన్న విషయాన్ని గుర్తించామని సీఎం తెలిపారు.
ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదని, పోలీసులు ఇప్పటివరకు పరస్పర ఘర్షణలకు దిగిన 70 మందిని అదుపులోకి తీసుకున్నారని సీఎం ఖట్టర్‌ వెల్లడించారు.  దీనికి సంబంధించి 44 కేసులు నమోదు అయ్యాయి. ఘర్షణల నేపథ్యంలో గురుగ్రామ్‌లోని పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్‌లతో సహా అన్ని విద్యాసంస్థలు మూసివేశారు.  మృతి చెందిన హోంగార్డులు నీరజ్, గురుసేవక్‌గా గుర్తించారు.  
 
సోమవారం నూహ్‌ పట్టణంలో వీహెచ్‌పీ శ్రేణులు ర్యాలీ నిర్వహిస్తుండగా మరో వర్గం వాళ్లు వారిపై రాళ్లు రువ్వారు. దాంతో రెండు వర్గాల వాళ్లు పరస్పర దాడులకు దిగి తీవ్ర ఘర్షణలు తలెత్తాయి. ఈ ఘర్షణల కారణంగా ప్రస్తుతం నూహ్‌లో కర్ఫ్యూ కొనసాగుతున్నది. మొబైల్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను కూడా నిషేధించారు.
 
గురుగ్రామ్‌లోని బాద్షాపూర్‌ ఏరియాలో ఘర్షణలు చెలరేగాయి. దాదాపు 100 నుంచి 200 మంది వరకు ఉన్న అల్లరి మూకల గుంపు బైకులపై వచ్చి బాద్షాపూర్‌లోని దుకాణాలకు, వాహనాలకు నిప్పుపెట్టింది. దాంతో గురుగ్రామ్‌లో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి గస్తీ నిర్వహిస్తున్నారు. గురుగ్రామ్‌ అంతటా 144 సెక్షన్‌ విధించారు. ముందు జాగ్రత్తగా ఫరీదాబాద్‌ తదితర ప్రాంతాల్లో కూడా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.