తిలక్‌కు ప్రజలే ‘లోకమాన్య’ బిరుదు ఇచ్చారు

‘లోకమాన్య’ బాల గంగాధర్ తిలక్ ఘనతను ప్రజలే గుర్తించారని, ఆయనకు ‘లోకమాన్య’ బిరుదును ఇచ్చారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని స్వీకరించడం తనకు మధుర జ్ఞాపకమని తెలిపారు. స్వాతంత్ర్య సమర యోధుడు తిలక్ 103వ వర్థంతి సందర్భంగా పుణేలో జరిగిన కార్యక్రమంలో మోదీకి మంగళవారం ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

లోకమాన్య తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ మోదీకి ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ హాజరయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ కూడా వేదికపై ఆసీనులయ్యారు.

భారత దేశంలో అశాంతికి పిత తిలక్ అని బ్రిటిషర్లు ముద్ర వేశారని ప్రధాని గుర్తు చేశారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జరిగే పోరాట దిశను తిలక్ మార్చేశారని అంటూ తిలక్ ఆధునిక భారత దేశ పిత అని మహాత్మా గాంధీ అభివర్ణించారని పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో తిలక్ పాత్రను ఏవో కొన్ని సంఘటనలు, మాటల ద్వారా వర్ణించలేమని చెప్పారు. 

ఈ పురస్కారంతో పాటు తనకు లభించిన నగదు మొత్తాన్ని ‘నమామి గంగే’ ప్రాజెక్టుకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ పురస్కారాన్ని 140 కోట్ల భారతీయులకు అంకితమిస్తున్నట్లు తెలిపారు.

శరద్ పవార్ మాట్లాడుతూ, పుణే నగరానికి గొప్ప చరిత్ర ఉందని తెలిపారు. ఈ నగరానికి దేశంలో చాలా ప్రాధాన్యం ఉందని చెబుతూపుణే జిల్లాలోని శివనేరి కోటలో ఛత్రపతి శివాజీ మహారాజు జన్మించారని, చాలా మంది రాజులు తమ పేరుపై రాజ్యాలను స్థాపించారని, శివాజీ మహారాజు మాత్రం హైందవి స్వరాజ్‌ను ఏర్పాటు చేశారని చెప్పారు. 
 
ఇటీవల మన సైనికులు సర్జికల్ స్ట్రైక్స్ చేశారని, అయితే అటువంటి దాడులను మొదట చేసినవారు ఛత్రపతి శివాజీ మహారాజు అని చెప్పారు. ఆయన లాల్ మహల్‌లో సయిష్టా ఖాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేశారని చెప్పారు. లోకమాన్య తిలక్ పురస్కారాన్ని స్వీకరిస్తున్న మోదీని ఆయన ప్రశంసించారు. 
 
ఈ పురస్కారాన్ని అనేక మంది ప్రముఖులు స్వీకరించారని, ఆ జాబితాలో ఇప్పుడు మోదీ చేరారని తెలిపారు. ఈ పురస్కారాన్ని ఆయన స్వీకరిస్తున్నందుకు ఆయనను అభినందిస్తున్నానని చెప్పారు. ఈ పురస్కారాన్ని పొందినవారిలో మోదీ 41వవారు. గతంలో డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, ప్రణబ్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజ్‌పాయి, ఇందిరా గాంధీ, బాలాసాహెబ్ దేవరస్, మన్మోహన్ సింగ్, ఎన్ఆర్ నారాయణ మూర్తి, ఈ శ్రీధరన్ వంటివారు ఉన్నారు.