ఈ ఏడాది తిరుమలలో రెండు సార్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ఈ ఏడాది అధిక మాసం సందర్భంగా తిరుమల శ్రీవారికి రెండు పర్యాయాలు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.  తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి సోమవారం సాయంత్రం తిరుమలలోని అన్నమయ్య భవనంలో అధికారులతో సమీక్షించారు. 
 
రెండు బ్రహ్మోత్సవాలతో పాటు సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 17వ తేదీ వరకు పెరటాసి మాసం కూడా ఉన్న క్రమంలో తిరుమలలో ఈ ఏడాది భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశముందని భావిస్తున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సెప్టెంబర్‌ 18వ తేదీన ధ్వజారోహణం సందర్భంగా ముఖ్యమంత్రి ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 
 
22వ తేదీన గరుడసేవ, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అక్టోబరు 19న గరుడ వాహనం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం జరుగనున్నాయి. గత ఏడాది తరహాలోనే ఈ ఏడాది కూడా గరుడ వాహన దర్శనం మాడవీధుల వెలుపల ఉండే భక్తులకూ చేయిస్తామన్నారు.
 
పెరటాసి మాసంలో తమిళ భక్తుల రద్దీ అధికంగా ఉంటుందనే అంచనాతో దివ్య దర్శనాన్ని రద్దు చేయనున్నారు. వీఐపీ బ్రేక్‌ దర్శనాలను కూడా ప్రొటోకాల్‌కే పరిమితం చేస్తారు.  వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 18న ధ్వజారోహణం ఉంటుంది. అదేరోజు సీఎం జగన్‌ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 22న గరుడసేవ, 23న స్వర్ణ రథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం జరుగుతాయి.
ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15న ప్రారంభమై 19న గరుడ వాహనసేవ, 20న పుష్పక విమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానంతో సమాప్తం అవుతాయి. పవిత్రమాసం సెప్టెంబరు 18న ప్రారంభమై అక్టోబరు 17న ముగుస్తుంది. 23, 30, అక్టోబరు 7, 14 తేదీల్లో పురటాసి శనివారాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో భారీగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.