పురంధేశ్వరి వ్యాఖ్యలతో వైసీపీ నాయకుల్లో వణుకు

* జగన్ ప్రభుత్వానికి బీజేపీ 9 ప్రశ్నలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డి పురందేశ్వరి అడిగిన ప్రశ్నలకు భయపడి, సమాధానం చెప్పలేని వైసీపీ నేతలు, మంత్రులు వ్యక్తిగతంగా ఆమెను విమర్శిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. తమ ప్రశ్నలపై టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి 24 గంటల్లో శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పి 48 గంటలైనా చేయలేదని  ఎద్దేవా చేశారు. సమాధానం లేదని పారిపోయారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా నాలుగేళ్ల వైసీపీ పాలనపై బీజేపీ వేస్తున్న 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

1) బాలల అక్రమ రవాణా విషయంలో దేశంలో ఏపీ 3వ స్థానంలో ఉంది. ఈ వైఫల్యానికి మీ సమాధానం ఏంటి?

2) తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ ఎందుకు వెనుకబడింది? వ్యవసాయం, ఆక్వా, ఉద్యానరంగం ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రంలో ఎందుకు తలసరి ఆదాయం పెరగలేదు?

3) జల్ జీవన్‌ మిషన్‌ పథకాన్ని రాష్ట్రంలో ఎందుకు వినియోగించుకోలేదు? ఈ పథకానికి అయ్యే ఖర్చులో కేంద్రం ఇచ్చే ఆర్ధిక సాయాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు? ఎందుకు ప్రజలకు మంచినీటిని అందించలేకపోయారు?

4) కేంద్ర ప్రభుత్వం పేదల కోసం కేటాయించిన 25 లక్షల ఇళ్లను ఎందుకు నిర్మించి ఇవ్వలేకపోయారు? ఇళ్ల స్థలాల్లో వచ్చే కమీషన్‌ కోసం 30 లక్షల ఇళ్ల స్థలాలను సేకరించారు. ఇళ్లు నిర్మిస్తే కమీషన్‌ రాదు కాబట్టి ఆ పనిచేయలేదా?

5)  రాష్ట్రంలో పేదలకు అందించే వైద్య సదుపాయాల విషయంలో ఎందుకు విఫలమయ్యారు? పట్టణ, గ్రామీణ వైద్య, ఆరోగ్యకేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, జనరల్‌ ఆసుపత్రుల్లో ఎందుకు వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు? ఎందుకు వైద్య పరీక్షలు అందుబాటులో లేవు? మందులు ఎందుకు ఇవ్వడం లేదు? వైద్యులు, వైద్య సిబ్బంది ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదు?

6) ప్యానల్‌లో ఉన్న 80 శాతం కార్పొరేట్‌ ఆసుపత్రులు ఎందుకు ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం చేయడం లేదు? వారికి బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు?

7) ఉన్నత విద్యను ఎందుకు నిర్లక్ష్యం చేశారు? పీజీ విద్యార్థులకు ఎందుకు ఉపకార వేతనాలు దూరం చేశారు. డిగ్రీలో తెలుగును రద్దుచేశారు. ఆంగ్లభాషకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు?

8)  ప్రభుత్వోద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదు? విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, కళాశాలల్లో లెక్చరర్లు, పాఠశాలల్లో టీచర్ల పోస్టులను ఎందుకు భర్తీచేయలేదు? ఖాళీగా ఉన్న 2.50 లక్షల బాక్‌లాగ్‌ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదు?

9) రాష్ట్రంలో  ఛిద్రమైన రహదారులను ఎందుకు పునర్నిర్మించలేదు? వైసీపీ మంత్రులు కారుయాత్ర చేస్తే రోడ్ల పరిస్థితి తెలుస్తుంది.

రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు చేసిన ద్రోహంపై, గుంటూరులో అమరావతి రైతులకు చేసిన అన్యాయంపై, పంచాయతీ నిధుల మళ్లింపుపై, రైతులకు రాయితీలు ఇవ్వకపోవడంపై, రాజమండ్రిలో ఆక్వా ఉత్పత్తుతులకు సహకారం ఇవ్వకపోవడంపై, విశాఖలో భూకబ్జాలు, దిగజారిన శాంతిభద్రతలపై, పారిశ్రామిక అభివృద్ధిని పురందేశ్వరి ప్రశ్నించారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 

 
అమెను విమర్శించే మంత్రులు ముందుగా ఆయా శాఖలకు ఏం పనులు చేశారో, ఎంత వరకు అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
‘‘విజయసాయిరెడ్డి విశాఖ అభివృద్ధికి ఏంచేశారు? రోజా పర్యాటక శాఖ అభివృద్ధికి ఏం చేశారు? గుడివాడ అమర్నాథ్ ఎన్ని కొత్త పరిశ్రమలు తెచ్చారు?” అంటూ బీజేపీ నేత నిలదీశారు. 
 
కోళ్ల గురించి ఎక్కువ అవగాహన ఉన్న అమర్నాథ్‌ కోళ్ల పరిశ్రమ పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. బొత్స సత్యనారాయణ ఎంత మంది పీజీ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చారు? విడదల రజని వైద్య ఆరోగ్య వ్యవస్థను ఎంతగా బలోపేతం చేశారో చెప్పాలి? అని ప్రశ్నల వర్షం కురిపించారు. 9 మంది లేదా 90 మంది లేదా కట్టకట్టుకుని రావాలని, ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆయన సవాల్ విసిరారు.