హర్యానాలో విశ్వహిందూ పరిషత్ ర్యాలీపై దాడి

హర్యానా మేవత్ రీజియన్ నుహ్ జిల్లా నంద్ గ్రామ సమీపాన సోమవారం విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన మతపరమైన ర్యాలీ హింసకు దారి తీసింది. విహెచ్‌పి కార్యకర్తలు చేపట్టిన ఈ ర్యాలీ నంద్ గ్రామానికి చేరుకోగానే కొందరు వ్యక్తులు ఈ ర్యాలీని అడ్డుకొని, రాళ్లతో దాడి చేయడంతోపాటు వాహనాలకు నిప్పు పెట్టారు. 

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీస్‌లు మొదట టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఇంకా పరిస్థితిని అదుపు లోకి తీసుకురాడానికి కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై అల్లర్లను అదుపు చేసేందుకు కేంద్రం అప్రమత్తమై పారామిలిటరీ బలగాలను హుటాహుటిన రంగం లోకి దింపింది.

హింసాత్మక ఘటనల్లో ఇద్దరు హోంగార్డులు మృతి చెందారని, డీఎస్పీ సజ్జన్‌ సింగ్‌ తలకు గాయమైందని, ఓ ఇన్‌స్పెక్టర్‌ తీవ్రంగా గాయపడ్డాడని స్థానిక పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. కనీసం 10 మంది పోలీసులు గాయాలకు గురయ్యారు. ఈ ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు హర్యానా పోలీస్‌లు రాష్ట్రంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా చెలరేగిన హింసకు సంబంధించిన వీడియో దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వాహనాలు తగులబడుతుండడం వీడియోలో కనిపించింది. ఉద్రిక్తతల నేపథ్యంలో  సోషల్‌ మీడియా అసత్య ప్రచారం, పుకార్లు వెల్లువెత్తకుండా నూహ్‌ పట్టణ పరిధిలో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలపై నిషేధం విధించారు. 

ఆగస్టు 2 వరకు నిషేధం అమల్లో ఉంటుందని, అప్పటి పరిస్థితిని బట్టి ఇంటర్నెట్‌పై బ్యాన్‌ను మరింత పొడిగించే అవకాశం కూడా ఉన్నదని అధికారులు వెల్లడించారు. 144 సెక్షన్ అమలు లోకి తెచ్చారు. ఢిల్లీకి సమీపంలోని గురుగావ్ పొరుగు జిల్లా సోన్హా జిల్లాకు కూడా అల్లర్లు వ్యాప్తి చెందడంతో పరిస్థితులను అదుపులోకి తీసుకు వచ్చేందుకు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ 15 కంపెనీల కేంద్ర దళాలను హర్యానాకు పంపించింది. 

హర్యానా హోం మంత్రి అనిల్ విజి ర్యాలీలో రాళ్లు రువ్వే సంఘటన జరిగిందని నిర్ధారించారు. విశ్వహిందూ పరిషత్ సభ్యులు పోలీస్‌ల నుంచి అనుమతి తీసుకునే ర్యాలీ చేట్టారని పేర్కొన్నారు.  ఒక్కసారిగా హింస చేలరేగడంతో ఓ వర్గానికి చెందిన దాదాపు 3 వేల నుంచి 4 వేల మంది స్థానికంగా ఉన్న నల్హార్‌ శివాలయంలో చిక్కుకున్నారని తెలిపారు.

రోడ్లన్నీ దిగ్బంధం కావడంతో సమీప జిల్లాల నుంచి పోలీస్ దళాలను, పారా మిలిటరీని హెలికాప్టర్ల ద్వారా సంఘటన స్థలానికి దించవలసి వచ్చిందని చెప్పారు.  అల్లరిమూకలు నిప్పుపెట్టడంతో పదుల సంఖ్యలో కార్లు, బైకులు తగులబడిపోయాయని ఆయన చెప్పారు. నూహ్‌లో పరిస్థితిని అదుపు చేసి శాంతిని నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అలజడులకు తావీయవద్దని మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా ప్రజలను అభ్యర్థించారు.

ఈ ఘర్షణల నేపథ్యంలో గురుగ్రామ్, ఫరీదాబాద్‌లలోని పాఠశాలలు, కళాశాలలను మంగళవారం మూసివేయాలని అధికారులు ఆదేశించారు. గురుగ్రామ్, నుహ్‌లలో సీఆర్‌పీసీ సెక్షన్ 144 నిబంధనలను అమలు చేస్తున్నారు. భివానీ పోలీసు సూపరింటెండెంట్ నరేంద్ర బిజర్నియాన్ మాట్లాడుతూ, పారామిలిటరీ దళాలను, హర్యానా ఎస్‌టీఎఫ్ బలగాలను మోహరించినట్లు తెలిపారు.

పరిస్థితిని రాష్ట్ర డీజీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు. కాగా, నూహ్ జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించడం కోసం కేంద్రం ఒక వారం రోజులపాటు 20 కంపెనీల రాపిడ్ ఆక్షన్ ఫోర్స్ లను పంపాలని హర్యానా ప్రభుత్వం కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖను కోరింది.