ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనం

టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంలో చేయాలని సోమవారం సీఎం కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సుదీర్ఘంగా కొనసాగిన మంత్రివర్గ భేటీలో నిర్ణయించారు. త్వరలో జరిగే అసెంబ్లీ వర్షకాల సమావేశాల్లో టీఎస్ఆర్టీసీ విలీనం బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేబినెట్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

టీఎస్ ఆర్టీసీకి చెందిన 43,373 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయానికి సంబంధించిన విధివిధానాలు, నిబంధనలు రూపొందించేందుకు ఓ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్‌ చెప్పారు. కాగా, వచ్చే మూడు, నాలుగేళ్లలో హైదరాబాద్‌ మెట్రో వ్యవస్థను విస్తరించేందుకు కేబినెట్‌నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాయదుర్గం- శంషాబాద్ ఎయిర్ పోర్టు మధ్య మెట్రో రైలు విస్తరణ టెండర్‌ ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. 

మియాపూర్‌ నుంచి మియాపూర్ వరకు మెట్రో విస్తరణకు మంత్రి వర్గం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. మియాపుర్‌ నుంచి లక్డీకపూల్‌ వరకు, ఎల్బీనగర్‌ నుంచి పెద్ద అంబర్‌పేట వరకు, ఉప్పల్‌ నుంచి బీబీ నగర్‌, ఈసీఐఎల్‌ వరకు మెట్రో విస్తరణకు కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు.  అదే విధంగా కొత్తూరు-షాద్‌నగర్‌ వరకు మెట్రో రైలు విస్తరణ చేపడతామని తెలిపారు. జేబీఎస్‌ నుంచి తూంకుంట, ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు డబుల్‌ డెక్కర్‌ మెట్రో నిర్మాణం చేపడతామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, కె. సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నియమించాలని సిపార్సు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. వరంగల్ ఎయిర్ పోర్ట్ కు భూములు, హకీమ్ పేట ఎయిర్ పోర్ట్ ను పౌర సేవలకు వాడాలని కోరుతూ కేంద్రానికి తీర్మానం పంపాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. వరద నష్టంపై తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.