అన్ని వర్గాల ప్రజలను దోచుకొంటున్న కేసీఆర్

గడచిన తొమ్మిదేళ్లలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ కేసీఆర్ తాను మాత్రం దోచుకుని దాచుకున్నాడని  ఘాటుగా కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు.
రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా పాలమూరు గడ్డపై నుండి పోరు యాత్రకు శ్రీకారం చుట్టిన కిషన్ రెడ్డిగడియారం చౌరస్తాలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రజాకారులను తలపించే విధంగా సీఎం కేసీఆర్ నియంత అరాచక పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. 

తెలంగాణ సెంటిమెంట్ తో 2014లో మొదటిసారి గద్దెనెక్కిన కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా దళితున్ని చేస్తానని చెప్పి దళితులకు వెన్నుపోటు పోడిచారని విమర్శించారు. 2018లో మరోసారి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన కేసీఆర్ తొమ్మిదేళ్లు గడుస్తున్న ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా తన గారడి మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నాలుగు కోట్ల ఇండ్లు మంజూరు చేసిందని, తెలంగాణలో సీఎం కేసీఆర్ డబల్ బెడ్ రూమ్ ల పేరుతో నిరుపేదలను మభ్యపెట్టి ఏ ఒక్కరికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయలేదని ఎద్దేవా చేశారు. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాధనాన్ని కొల్లగొట్టి నిజాం నవాబు కట్టుకున్నట్టుగా పదేకరాలలో తాను ఇల్లు కట్టుకున్నాడని విమర్శించారు.

అంతేకాక కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొరకు మరో 10 ఎకరాలు, బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కార్యాలయానికి కూడా మరో పదేకరాలు కేటాయించాడు కానీ 9 ఏళ్ల గడిచిన ఏ ఒక్క లబ్ధిదారునికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించలేదని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డులు తప్ప తెలంగాణ ఏర్పడ్డాక ఏ ఒక్క నిరుపేదకు రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ప్రశ్నించారు.

9 ఏళ్లలో ఒక్క పోస్టుకూడా భర్తీ చేయలేదని, 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఆకలిమంటల్లో ఉన్నారని తెలిపారు. పేపర్ లీక్‌తో నిరుద్యోగులు ఆవేదనలో ఉన్నారని చెబుతూ ప్రజలను మోసం చేసిన చరిత్ర కేసీఆర్ ది అని ధ్వజమెత్తారు. రైతు రుణ మాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అప్పులు కట్టలేక డిఫాల్టర్‌గా మారటం వల్ల రైతులకు అప్పు పుట్టటం లేదని చెప్పారు. బంగారు పడ్డారు.

 

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తానే కెసిఆర్ నియంత పాలన అంతమవుతుందని జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలందరికీ ఇవ్వాలని ఉద్దేశంతో బిజెపి పోరుబాట పట్టిందని తెలిపారు. తొమ్మిదేళ్లు గడిచిన ఏ ఒక్క లబ్ధిదారునికి రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయకపోగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇండ్లు కట్టుకునేందుకు మూడు లక్షలు ఇస్తామని, దళిత బంధు, బీసీ బందు పేరుతో కేసీఆర్ మరోసారి ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. 

బిజెపి నాయకులు కార్యకర్తలు గడపగడపకు తిరిగి కెసిఆర్ మోసాలను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆమె కోరారు. పాలమూరు జిల్లాలో స్థానిక మంత్రి అరాచక పాలన చేస్తూ తన అహంకారంతో పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రశ్నించిన అమాయకమైన ప్రజలపై కేసులు పెట్టి బెదిరించి వారి భూములు ప్లాట్లు లాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ నాయకులు అభివృద్ధి పేరుతో నాసిరకంగా పనులు చేస్తూ లక్షల కోట్లు దండుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆమె విమర్శించారు.