త్వరలో వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌లు

రానున్న రోజుల్లో వందేభారత్‌ రైళ్లలో అనేక కొత్త మార్పులు జరగనున్నాయి. ప్రధానంగా వందేభారత్‌లో స్లీపర్‌ కోచ్‌లను ప్రవేశపెట్టనున్నారు. దీనితో పాటు వందే మెట్రో రైళ్లు రానున్నాయి. వివిధ మెట్రో నగరాల్లో ప్రస్తుతం ఉన్న మెట్రో రైళ్లను ఎక్కువగా దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇక నుంచి మన దేశంలోనే తయారైన వందే మెట్రో రైళ్లు రానున్నాయి. వీటితో పాటు వందేభారత్‌ కొత్త రైళ్లలో జనరల్‌ బోగీలు, సెకండ్‌ క్లాస్‌ త్రీ టైర్‌ కోచ్‌లు ఉంటాయని ఐసీఎఫ్‌ చెన్నయ్‌ జనరల్‌ మేనేజర్‌ బీజీ మాల్యా తెలిపారు. 

వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌లు ఇంటిరియర్‌ డిజైన్‌ ఫైనల్‌ అయిందని, ముందుగా 16 కోచ్‌లు ఉన్న స్లీపర్‌ వందేభారత్‌ను ఈ సంవత్సరం చివరి నాటికి తీసుకు రానున్నట్లు తెలిపారు.  తరువాత అనేక స్లీపర్‌ కోచ్‌లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. రాజధాని ట్రైన్స్‌ కంటే ఈ వందేభారత్‌ స్లీపర్‌లో అనేక ఆధునిక సదుపాయలు ఉన్నాయని తెలిపారు. 

ఇందులో ఆన్‌బోర్డ్‌ వైఫై, ఇన్ఫోటెన్‌మెంట్‌, అత్యున్నత సాంకేతికతతో పాటు, ఆకట్టుకునే ఇంటిరియర్‌ డిజైన్లు, సాఫ్ట్‌ లైటింగ్‌, పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌, ప్యాసింజర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌, స్మోక్‌, అండ్‌ ఫైయిర్‌ డిటెక్షన్‌, కోచ్‌ల్లో నిఘా కెమెరాలు, ఎమర్జీని సమయాల్లో సంప్రదించే సదుపాయం, రైళ్లు ఢీకొనకుండా నివారించే కవచ్‌ సిస్టమ్స్‌ను ఇందులో ఉంటాయని ఆయన వివరించారు.

వందేభారత్‌ చైయిర్‌ కార్‌ వెర్షన్‌లో ఈ ఆర్ధిక సంవత్సరంలో మొత్తం 75 రైళ్లను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మాల్యా వివరించారు. ఇందులో ఇప్పటికే 25 రైళ్లు నడుస్తున్నాయని, మిగిలిన వాటిని ఈ సంవత్సరంలోనే పట్టాలపైకి తీసుకు రానున్నట్లు తెలిపారు. దేశ అవసరాలకు కావాల్సిన రైళ్ల తయారీకి అవసరమైన ఫోర్జ్‌డ్‌ వీల్స్‌ కోసం రైల్వే శాఖ కాంట్రాక్ట్‌ ఇచ్చింది. 

ఈ సంవత్సరం జూన్‌లో రానున్న 20 సంవత్సరాల్లో15 లక్షల వీల్స్‌ తయారీకి రెండు సంస్థలకు కాంట్రాక్ట్‌ ఇచ్చినట్లు తెలిపారు. వందే మెట్రో రైళ్లను కూడా ఈ ఆర్ధిక సంవత్సరంలోనే ప్రారంభిస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. వందేభారత్‌లో సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లను కూడా ప్రవేశపెట్టనున్నారు.  22 కోచ్‌ల్లో 12 నాన్‌ ఏసీవి ఉంటాయని, వీటిలో 8 సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉంటాయని మాల్యా తెలిపారు. రెండో బోగీలు లగేజ్‌, గార్డ్‌ కోసం కేటాయించనున్నట్లు వివరించారు. ఈ వందేభారత్‌ రైళ్లను కూడా ఈ ఆర్ధిక సంవత్సరంలోనే ప్రవేశపెట్టనున్నారు. ఇవన్నీ కూడా ఐసీఎఫ్‌ కోచ్‌లుగానే ఉంటాయి.