ఆదాయపు పన్ను రిటర్నులకు సోమవారం గడువు

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి సోమవారంతో గడువు ముగియనున్నది. ఇప్పటికే గడువు పొడిగిస్తూ వచ్చిన కేంద్రం ఈ సారి మాత్రం గడువు పొడిగించేది లేదని ఇప్పటికే స్పష్టం చేసింది. రేపటితో గడువు ముగియనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఐటీఆర్‌లు ఫైల్‌ అయ్యాయి. 
 
ఇప్పటి వరకు 5.83కోట్లకుపైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయని, ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు 10.39లక్షల ఐటీ రిటర్నులు దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.  అయితే, గడువు రేపటితో ముగిసినా.. ఆలస్య రుసుముతో ఈ ఏడాది డిసెంబర్‌ వరకు చెల్లించే అవకాశం ఉంది. 
 
ఆలస్యంగా ఐటీఆర్‌లు దాఖలు చేసిన పక్షంలో సెక్షన్‌ 324ఎఫ్‌ కింద రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు జరిమానా విధించే అవకాశాలుంటాయి. గతేడాది జులై 31 వరకు దాఖలైన ఐటీఆర్‌ల సంఖ్యను దాటిందని ఆదాయపు పన్నుశాఖ తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు 46లక్షలకుపైగా విజయవంతంగా లాగిన్‌లు నమోదయ్యాయని, నిన్న ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో 1.78 కోట్లకుపైగా లాగిన్స్‌ వచ్చాయని పేర్కొంది.ఇవాళ మధ్యాహ్నం వరకు 10.39లక్షల ఐటీఆర్‌ దాఖలు కాగా.. గడిచిన గంటలో 3.04లక్షల ఐటీఆర్‌లు ఫైల్‌ అయ్యాయని ట్విట్టర్‌ వేదికగా ఆదాయపు పన్నుశాఖ తెలిపింది. అయితే, పెద్ద ఎత్తున ఒకేసారి ఐటీఆర్‌లు ఫైల్‌ చేస్తుండడంతో చెల్లింపుదారుల నుంచి వెబ్‌సైట్‌ మొరాయిస్తున్నట్లుగా పలు ఫిర్యాదు వచ్చాయి. 

అయితే, పోర్టల్‌ బాగానే పని చేస్తుందని ఐటీశాఖ తెలిపింది. అయితే, పన్ను చెల్లింపుదారులు చివరి వరకు గడువు పొడిగింపు కోసం ఎదురుచూడొద్దని, పెనాలిటీ లేకుండా చెల్లించేందుకు ఐటీఆర్‌లను ఫైల్‌ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.