సుప్రీం పర్యవేక్షణలో `మణిపూర్’ దర్యాప్తునకు కేంద్రం సిద్ధం

మణిపూర్ హింసపై జరుగుతున్న విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షించేందుకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని  సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పష్టం చేశారు.  భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తో పాటు జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ముందు మణిపూర్ హింసకు సంబంధించిన పలు పిటిషన్లు సోమవారం విచారణకు రాగా, వీటిపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. 
 
మే 4న విడుదలైన వీడియోలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, ఆ ఇద్దరు బాధిత మహిళల తరఫున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్ వాదన వినిపించారు. ఈ కేసును సీబీఐ విచారించాలన్న కేంద్రం అభిప్రాయంతో పాటు, అసోం రాష్ట్రానికి కేసు బదిలీ చేయాలన్న విషయంలోనూ బాధిత మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారని, ఇందుకు వారు అంగీకరించడం లేదని సిబాల్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. 
 
దీనిపై తుషార్ మెహతా స్పందిస్తూ, అసోంకి కేసును బదిలీ చేయాలని తాము చెప్పలేదని, కేవలం వేరే రాష్ట్రమని మాత్రమే ప్రస్తావించామని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, మే 3వ తేదీ నుంచి అల్లర్లు మొదలయ్యాయని అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్ని ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారో చెప్పాలని, మణిపూర్‌లో ఇళ్ల పునర్మిర్మాణానికి కేంద్రం ఎలాంటి ప్యాకేజీ ప్రకటించిందని ప్రశ్నించారు. 
 
సీఐఐకి, సిట్‌కు కేసును అప్పగించిన మాత్రన సరిపోదని, బాధితులకు నేరుగా, సత్వర న్యాయం జరిగేలా చూడాలని సూచించింది. మణిపూర్‌లో ఇటువంటి ఘటన (వీడియో ఘటన)లు ఒకటి మాత్రమే జరగలేదని, మహిళలపై హింస విషయంలో విస్తృత యంత్రాగాన్ని రూపొందించాలని ఆదేశించింది. 
 
బాధిత మహిళలు, మహిళా న్యాయమూర్తులు, డొమైన్ ఎక్స్‌పర్ట్‌లతో ఒక కమిటీ వేయడం ఒక మార్గమని సూచించారు. దీనిపై సిబాల్ స్పందిస్తూ, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు సాగాలని ధర్మాసనాన్ని కోరారు. ఈ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎస్‌జీ తుషార్ మెహతా కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది.
 
ఇంతవరకు ప్రభుత్వం ఏమి చేసిందనే దానిపైనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే విషయం ఆధారపడి ఉంటుందని, ప్రభుత్వ చర్యలతో సంతృప్తి చెందినట్లయితే తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని సీజేఐ తెలిపారు.