శ్రీన‌గ‌ర్ – బారాముల్లా హైవేపై భారీగా పేలుడు ప‌దార్థాలు

శ్రీన‌గ‌ర్ – బారాముల్లా హైవేపై భారీగా పేలుడు ప‌దార్థాలు
జ‌మ్మూక‌శ్మీర్‌లోని శ్రీన‌గ‌ర్ – బారాముల్లా హైవేపై సోమ‌వారం ఉద‌యం భారీగా పేలుడు ప‌దార్థాలు ల‌భ్య‌మ‌య్యాయి. పేలుడు ప‌దార్థాల‌ను గ‌మ‌నించిన భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఆ మార్గంలో రాక‌పోక‌ల‌ను నిలిపివేశారు. త‌క్ష‌ణ‌మే బాంబు డిస్పోజ‌ల్ స్క్వాడ్ అక్క‌డికి చేరుకుని, పేలుడు ప‌దార్థాల‌ను నిర్వీర్యం చేసింది. 
పేలుడు ప‌దార్థాలు ల‌భించిన ఏరియాతో పాటు ఆ ప‌రిస‌రాల్లో భ‌ద్ర‌తాల బ‌ల‌గాలు కూంబింగ్ చేప‌ట్టాయి.
ప‌ట్ట‌ణ్ ఏరియాలోని జంగం ఫ్లై ఓవ‌ర్‌పై పేలుడు ప‌దార్థాలు ల‌భ్య‌మైన‌ట్లు సీఆర్పీఎఫ్ అధికారులు వెల్ల‌డించారు. బారాముల్లా – శ్రీన‌గ‌ర్ హైవే పైనే జంగం ఫ్లై ఓవ‌ర్ ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు.  అయితే ప్ర‌ధాన ర‌హ‌దారి కావ‌డంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మై ఇరు వైపులా ట్రాఫిక్‌ను నిలిపివేశారు. పేలుడు ప‌దార్థాల‌ను నిర్వీర్యం చేసిన అనంత‌రం వాహ‌నాల రాక‌పోక‌ల‌కు అనుమ‌తి ఇచ్చారు.
అయితే ఈ మార్గంలో ప్ర‌తి రోజు ఉద‌యం సాధారణంగా ఆర్మీ కాన్వాయ్‌లు తిరుగుతుంటాయ‌ని పోలీసులు తెలిపారు. జ‌వాన్ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని పేలుడు ప‌దార్థాల‌ను ఫ్లై ఓవ‌ర్‌పై పాతిపెట్టి ఉండొచ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు.

3 కేజీల హెరాయిన్ త‌ర‌లిస్తున్న పాక్ డ్రోన్ ప‌ట్టివేత‌

మరోవంక, పంజాబ్‌లోని టర్న్ టరన్ జిల్లాలో గల భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో అనుమానిత పాకిస్థాన్ డ్రోన్, మూడు కిలోల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీఎస్‌ఎఫ్, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో ఇవి బయటపడ్డాయని అధికారులు తెలిపారు.  సరిహద్దు భద్రాతా దళాలకు ఆదివారం టర్న్ టరన్‌లోని కలాష్ గ్రామ సమీపంలో డ్రోన్ శబ్దం వినిపించిందని బీఎస్‌ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. 

ఆ సమయంలోనే మానవరహిత వైమానిక వాహనం పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం భద్రతా దళాలు డ్రోన్‌ను అడ్డగించేందుకు ప్రయత్నించాయని బీఎస్‌ఎఫ్ తెలిపింది.  సోమవారం పంజాబ్ పోలీసులతో సంయుక్తంగా జరిపిన సోదాల్లో ఖేమ్‌కరన్ గ్రామ సమీపంలోని పొలంలో డ్రోన్, పసుపు టేప్‌తో చుట్టబడిన 3 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే బీఎస్‌ఎఫ్, పంజాబ్ పోలీసుల సంయుక్త ప్రయత్నాల ద్వారా మరో పాకిస్థాన్ డ్రోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.