చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్‌-3

చంద్రయాన్‌-3 ప్రయోగంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకున్నది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-3 ఒక్కోదశను దాటుకుంటూ విజయవంతంగా ముందుకువెళ్తున్నది. ఇప్పటికే ఐదు దశలను పూర్తిచేసుకున్న చంద్రయాన్‌ వ్యోమనౌక ఆరో దశ అయిన చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. 
సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రాన్స్‌ లూనార్‌ కక్ష్యలోకి ప్రవేశించినట్లు ఇస్రో వెల్లడించింది. 
ఉపగ్రహంలోని ఇంధనాన్ని 28 నుంచి 31 నిమిషాలు పాటు మండించి లూనార్ అర్బిట్‌లోకి శాస్త్రవేత్తలు పంపించారు. చంద్రుని కక్షలోకి చంద్రయాన్ -3 చేరుకోవడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం చోటు చేసుకుంది.  భూమి చుట్టూ తన కక్ష్యలను పూర్తి చేసి చంద్రుని వైపు వెళ్తున్నదని తెలిపింది.  ఇస్రో టెలిమెట్రి, ట్రాకింగ్‌, కమాండ్‌ నెట్‌వర్క్‌ వద్ద పెరిజీ-ఫైరింగ్‌ విజయవంతంగా పూర్తయిందని, వ్యోమనౌకను ట్రాన్స్‌లూనార్‌ కక్ష్యలోకి ప్రవేశపెట్టామని పేర్కొన్నది. 
 
ఇక తదుపరి గమ్యం చంద్రుడేనని, మరో ఐదు రోజుల్లో అంటే ఆగస్టు 5 నాటికి చంద్రుడి కక్ష్యకు చేరుకుంటుందని వెల్లడించింది. ట్రాన్స్‌ లూనార్‌ ఇంజెక్షన్‌ ప్రక్రియ తర్వాత వ్యోమనౌక భూ పరిభ్రమణాలు పూర్తిచేసుకుని చంద్రుని మార్గాన్ని అనుసరిస్తున్నదని ఇస్రో అధికారి ఒకరు తెలిపారు. చంద్రయాన్‌ -3 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ఎల్వీఎం-3 ఎం-4 రాకెట్ ప్రవేశపెట్టింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎవరూ చూడని నిగూఢ రహస్యాలను ఛేదించే చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టారు.
 
కాగా, వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత దాని నుంచి ల్యాండర్‌ విడిపోవడం, చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కావడం వంటి కీలక ఘట్టాలు జరుగుతాయి. ఈ ప్రక్రియ ఆగస్టు 23 నాటికి పూర్తికానుంది.  ఈ వ్యోమనౌక దాదాపు 40 రోజులపాటు అంతరిక్షంలో ప్రయాణించి చివరికి ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై దిగనుంది.
 
ఇది విజయంతంగా జరిగినట్లయితే అమెరికా, చైనా, రష్యాల సరసన భారత్‌ చేరనుంది. చంద్రుడిపై దాగి ఉన్న రహస్యాలను చేధించే లక్ష్యంతో చంద్రయాన్‌-3 రాకెట్‌ను ఇస్రో జూలై 14న ప్రయోగించిన విషయం తెలిసిందే.