రేవంత్ రెడ్డి కనిపించడం లేదంటూ పోస్టర్లు

రేవంత్ రెడ్డి కనిపించడం లేదంటూ పోస్టర్లు
 
తెలంగాణాలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానంటూ హడావుడి చేస్తున్న టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికలలో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులు తమ పార్టీలో లేకపోవడంతో ఇతర పార్టీల నుండి ఎవ్వరు వస్తారా అంటూ బేరసారాలు చేస్తుండడంతో మునిగిపోయారు. అయితే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవోడం మాత్రం మరచిపోయారు.
 
సాధారణ రోజులలో ఎంపీ కనిపించక పోయినా, అధికార కార్యక్రమాలలో పాల్గొనకపోయినా ఎవ్వరూ పట్టికిన్చుకోరు. కానీ వర్షాలు, వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో అయినా సహాయం చేయకపోయినా కనీసం పలకరించే ప్రయత్నం కూడా చేయకపోవడంతో విమర్శలు చెలరేగుతున్నాయి.
 
గత రెండు వారాలుగా తెలంగాణ అంతా భారీ వర్షాలతో జనజీవనం కకావికాలం అయిపోవడం తెలిసిందే. ఇటువంటి సమయంలో కూడా రేవంత్ రెడ్డి కనిపించడంలేదని మల్కాజ్ గిరి నియోజకవర్గంలో పలుచోట్ల గోడలపై అతికించిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. వర్షాలతో నగరం అతలాకుతలమై పోతుంటే ఎంపీగా ముఖం చూపించడం లేదంటూ జనం వాపోతున్నారు.
 
2020లో నియోజకవర్గాన్ని వరదలు ముంచెత్తినప్పుడు కూడా నియోజకవర్గంలో సందర్శించలేదని, ఇప్పుడు కూడా వరద బాధితులను పరామర్శించడానికి రాలేదని విమర్శలు చెలరేగుతున్నాయి. వరద బాధితులకు రూ 10,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలంటూ  జిహెచ్ఎంసి కార్యాలయం వద్ద కార్యకర్తలతో ధర్నా చేయించిన రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలో కనిపించకపోవడంతో జనం విమర్శలు కురిపిస్తున్నారు.
 
 హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటువంటి సమయంలో రేవంత్ రెడ్డి కనిపించడంలేదంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 
ఓ ఎంపీగా ఎప్పుడైనా నియోజకవర్గంలో పర్యటించారా? అంటూ పోస్టర్లలో రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అయితే, తమ ఎంపీ ఎందుకు నియోజకవర్గ ప్రజలకు ముఖం చూపించలేక పోతున్నారో తెలుసుకొనే ప్రయత్నం చేయాల్సింది పోయి ఈ పోస్టర్లను రాజకీయ ప్రత్యర్ధులు అతికించారంటూ కాంగ్రెస్ నేతలు వారిపై మండిపడుతున్నారు.
 
రేవంత్‌రెడ్డి ఇక్కడి నుండి గెలిచినప్పటికి గత ఏడాది కాలంగా పెద్దగా నియోజకవర్గ పరిధిలో పర్యటించడం, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని పోస్టర్ల ద్వారా ప్రచారం జరుగుతోంది.  పోస్టర్లపై మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి మిస్సింగ్ అంటూ రెండు ఫోటోలు పెట్టారు. ఒకటి 2020 హైదరాబాద్‌ వర్షాలు కాగా, మరో ఫోటో కింద 2023 హైదరాబాద్ వర్షాలుఅంటూ కామెంట్స్ పెట్టారు. అంటే మూడేళ్ల క్రితం వర్షాల్లో పోయిన వ్యక్తి ఇప్పటికి కనిపించడం లేదని చెప్పకనే ప్రచారం చేస్తున్నారు.