నిజమైన హైదరాబాద్ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ లోని వర్ష, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. యూసుఫ్ గూడలో పొంగిపొర్లుతున్న నాలాలు, రోడ్లను పరిశీలించిన ఆయన సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అభివృద్ధి అంటే ఫ్లైఓవర్లు కాదు, బస్తీలను కూడా బాగు చేయాలని హితవు చెప్పారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వంకు 80 శాతం నిధులు వస్తున్నా వాటిల్లో 8 శాతం కూడా హైదరాబాద్ కోసం వినియోగించడం లేదని ధ్వజమెత్తారు.

నగరంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బ తిందని, పూడిక తీయకపోవడంతో రోడ్లపై మురుగు పారుతోందని, బస్తీల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీవరేజ్ బోర్డు నిధుల కొరతతో ఇబ్బంది పడుతోందని, కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇవ్వ డం లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. 

ప్రభుత్వ పెద్దలు హైటెక్ సిటీ, మాదాపూర్ కే డబ్బులు ఖర్చు చేస్తున్నారు తప్పితే బస్తీలను పట్టించుకోవడం లేనని కేంద్ర మంత్రి మండిపడ్డారు.  నిజమైన హైదరాబాద్ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 

అంబర్‌పేటలో వర్షాలకు నీటమునిగిన కాలనీలను కిషన్ రెడ్డి పరిశీలిస్తూ   రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల అప్పులు చేసినా కూడా హైదరాబాద్ అభివృద్ధికి మౌలిక వసతులు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఇంకా అధికారంలో ఉండే మూడు నెలలు అయిన సీఎం కేసీఆర్  హైదరాబాద్ గురించి ఆలోచించాలని కోరారు.

ఇలా ఉండగా, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిరుపేదలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ భరోసా ఇచ్చారు. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని 38వ, 22వ, 34వ డివిజన్ లో వర్ష ప్ర‌భావిత ప్రాంతాల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా 38వ డివిజన్ లోని భారీ వర్షాలకు ఇండ్లు కూలిపోయాయి. బాధితుల ద‌గ్గ‌రికి వెళ్లి 15 రోజులకు సరిపడే నిత్యావసర సరుకులు, తక్షణ ఆర్థిక సాయంగా కొంత డబ్బులు అందచేసారు.

భాగ్యనగరాన్ని బ్రష్టుపట్టించి నిందలా?
 
కాగా, భాగ్యనగరాన్ని బ్రష్టుటుపట్టించి ప్రతిపక్షాలపాలై నిందలు వేస్తారా? అంటూ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పై కిషన్ రెడ్డి మండిపడ్డారు. జూబ్లీ హిల్స్ వేంకటగిరి డివిజన్ లో పొంగిపొర్లుతున్న నాళాలను పరిశీలిస్తూ తామేమీ రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు చేస్తుంటే కల్వకుంట కుటుంభం మాత్రమే రాజకీయాలు చేస్తుందని ధ్వజమెత్తారు.
 
హైదరాబాద్ లో వరద కాల్వలను అభివృద్ధి చేయాలన్నీ ఎన్నిసార్లు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.  వర్షపు నీటి కాలువల పూడిక తీయని కారణంగానే అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు. పూడికలు తీసే కాంట్రాక్టర్లకు జిహెచ్ఎంసి సకాలంలో బిల్లులు చెల్లించని కారణంగానే పనులు ఆగిపోయాయని కిషన్ రెడ్డి తెలిపారు.
 
హైదరాబాద్ నగరాన్ని ఇస్తాంబుల్ చేస్తాం.. సింగపూర్, లండన్, న్యూయార్క్, వాషింగ్టన్ చేస్తాం అంటూ చాలాసార్లు చెప్పారని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. అయితే, చిన్న వర్షాలకే హైదరాబాద్ అతలాకుతలమై, జనజీవనం స్తంభించిపోయి ఎద్దేవా చేశారు.