ఏపీలో 30 వేల మంది మహిళల అదృశ్యం

ఏపీలో మహిళలు పెద్ద ఎత్తున తప్పిపోవడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తన `వారాహి విజయ యాత్ర’లో ప్రశ్నించడంతో పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. తప్పిపోయిన మహిళలకు వాలంటీర్ వ్యవస్థతో ఆయన లింక్ పెట్టడంతో అధికార పార్టీ నుండి తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తం అయ్యాయి. 
 
వాలంటీర్లు సేకరిస్తున్న డేటా కారణంగా `మానవ అక్రమ రవాణా’ జరిగిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అసలు తమని మహిళలు రాష్ట్రంలో తప్పిపోలేదని, పొలిసు కేసులు నమోదు కాలేదంటూ మంత్రులు, వైసిపి నేతలు వాదిస్తూ వచ్చారు. దీనిపై ఏపీ మహిళా కమీషన్ పవన్ కళ్యాణ్ కు ఆధారాలు చూపమని, లేని పక్షంలో వాలంటీర్లకు క్షమాపణ చెప్పమని నోటీసులు జారీ చేసింది.
 
మరోవంక, ఏపీ ప్రభుత్వం పవన్ పై పరువునష్టం దావా వేసేందుకు ఓ ప్రత్యేక జిఓ తీసుకు వచ్చింది. ఓ మహిళా వాలంటీర్ విజయవాడ సివిల్ కోర్టులో కేసు కూడా వేశారు. ఈ వివాదం ఈ విధంగా కొనసాగుతూ ఉండగా ఏపీలో గత మూడేళ్ళలో  30 వేలకు పైనే మహిళలు ఏపీలో తప్పిపోయిన్నట్లు  రాజ్యసభలో కేంద్రం తెలిపింది. అయితే, వీరిలో చాలా మంది ఆచూకీ లభించిందని ఏపీ ప్రభుత్వం గతంలో చెప్పింది. 
రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఏపీలో 2019- 2022 మధ్య 30 వేల మంది బాలికలు, మహిళలు అదృశ్యం అయ్యారని తెలిపారు. ఏపీలో 2019లో 2186 మంది బాలికలు(18 ఏళ్లు కన్నా తక్కువ వయసున్నవారు), 6252 మంది మహిళలు అదృశ్యం అయిన్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. 

 
2020లో 2374 మంది బాలికలు, 7057 మంది మహిళలు, 2021లో 3358 మంది బాలికలు, 8969 మంది మహిళల ఆచూకీ లభించలేదని లెక్కలు చెబుతున్నాయి. మూడేళ్లలో తప్పిపోయిన వారి సంఖ్య 30196గా ఉంది. వీరిలో కొంత మంది ఆచూకీ అనంతరం తెలిసిందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. 
 
మూడేళ్లలో దేశం మొత్తం మీద 3.5 లక్షల మందికి పైగా బాలికలు, మహిళల ఆచూకీ దొరకలేదని కేంద్ర హోంశాఖ రాజ్యసభకు తెలిపింది. తెలంగాణలో దాదాపుగా 40 వేలకు పైగా అటువంటి కేసులు నమోదయ్యాయని లెక్కలు చెబుతున్నాయి. అయితే మహిళల అదృశ్యంకు, మానవ అక్రమ రవాణాకు  సంబంధం లేదని, పైగా ఈ  కేసులతో వాలంటీర్లకు సంబంధంలేదని ఏపీ ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి.
 
ఇలా ఉండగా, పవన్ కల్యాణ్ పై దాఖలు చేసిన క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ ను  విజయవాడ కోర్టు తిప్పిపంపింది. ఈ వ్యవహారంపై విచారణ చేసే అధికారం ఈ కోర్టు పరిధిలోకి ఎలా వస్తుందో చెప్పాలని కోరింది. పవన్ వ్యాఖ్యలు ఫిర్యాదురాలి ప్రతిష్ఠను ఏవిధంగా దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పేందుకు సరైన ఆధారాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. వాలంటీర్ గా నియమించినట్లు అపాయింట్మెంట్ లెటర్ కోర్టుకు సమర్పించాలని సూచించింది.