ప్రతిపక్షాల నిరసనల మధ్య ఆరు బిల్లులు

మణిపూర్‌లో జరిగిన హింసాకాండపై ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య జమ్మూకాశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించే బిల్లుతో సహా ఆరు బిల్లులను కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. మణిపూర్‌ అంశంపై చర్చ జరగాలని ప్రతిపక్షసభ్యులు స్పీకర్‌ పోడియం చుట్టూ చేరి కాగితాలు విసిరేశారు.  దీంతో వెంటనే స్పీకర్‌ ఓంబిర్లా జననాలు- మరణాల నమోదు (సవరణ) బిల్లు 2023ని ప్రవేశపెట్టాలని హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్‌రాయ్ ని కోరారు.

అయితే కాంగ్రెస్‌కు చెందిన మనీష్‌తివారీ ఈ బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు. అలా చేయడానికి సభకు ‘శాసనసభ సామర్థ్యం’ లేదని పేర్కొన్నారు. ఈ చర్య గోప్యత, అధికార విభజన హక్కును ఉల్లంఘిస్తుందని తివారీ విమర్శించారు. అనంతరం వాయిస్‌ ఓటింగ్‌ ద్వారా మంత్రి రాయ్  సభలో బిల్లును ప్రవేశపెట్టారు. అలాగే ఈ బిల్లు అనంతరం నరేంద్ర మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్ష సభ్యులు స్పీకర్‌కి నోటీసులిచ్చారు.

కాగా, ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్యలోనే మంత్రులు మరో ఐదు బిల్లులను ప్రవేశపెట్టారు. నిత్యానంద్‌రారు జమ్మూ-కాశ్మీర్‌ రిజర్వేషన్‌ (సవరణ) బిల్లు 2023ని ప్రవేశపెట్టడానికి ముందుకొచ్చారు. ఈ బిల్లుపై ప్రతిపక్ష సభ్యులు ఎవరూ వ్యతిరేకించకుండా వాయిస్‌ ఓటు ద్వారా ఆయన సభలో ప్రవేశపెట్టారు.

అట‌వీ సంర‌క్ష‌ణ స‌వ‌ర‌ణ బిల్లును లోక్‌స‌భ‌ ఆమోదించింది. దేశ స‌రిహ‌ద్దుల వ‌ద్ద సుమారు వంద కిలోమీట‌ర్ల ప‌రిధి వ‌ర‌కు ఉన్న అట‌వీ సంర‌క్ష‌ణ చ‌ట్టాల్ని మిన‌హాయించాల‌ని, ఆ ప్రాంతాల్లో ఉన్న అడ‌వుల్లో జూలు, స‌ఫారీలు, ఎకో టూరిజం సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేసే విధంగా కొత్త చ‌ట్టాన్ని రూపొందించారు. 

స్వ‌ల కాల చ‌ర్చ త‌ర్వాత అట‌వీ ప‌రిర‌క్ష‌ణ స‌వ‌ర‌ణ బిల్లు 2023కి ఆమోదం తెలిపారు. ప‌ర్యావ‌ర‌ణ‌శాఖ మంత్రి భూపేంద్ర యాద‌వ్ ఈ బిల్లుపై మాట్లాడారు. అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు, నియంత్ర‌ణ రేఖ‌, వాస్త‌వాధీన రేఖకు100 కిలోమీట‌ర్ల రేంజ్‌లో ఉన్న అడ‌వుల్లో జాతీయ ప్రాముఖ్య‌త క‌లిగిన ప్రాజెక్టులు నిర్మించే రీతిలో చ‌ట్టాన్ని స‌వ‌రించారు. బిల్లు పాసైన త‌ర్వాత‌ లోక్‌స‌భ గురువారానికి వాయిదా ప‌డింది.

అలాగే జమ్మూ కాశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2023ని కూడా రారు వాయిస్‌ ఓటుతో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు చెందిన హస్నైన్‌ మసూది వ్యతిరేకించారు. ఈ పునర్వ్యవస్థీకరణ చట్టం ‘రాజ్యంగపరంగా అనుమానిత చట్టం’ అని పేర్కొన్నారు.  సుప్రీంకోర్టు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నందున ఈ అంశం సబ్‌ జడ్జియే పరిశీలిస్తారని హస్నైన్‌ తెలిపారు. ‘న్యాయ పరిశీలనలో ఉన్న చట్టాన్ని సవరించడం రాజ్యాంగ ఔచిత్యానికి విరుద్ధం’ అని ఆయన అభ్యంతరం తెలిపారు.

కేంద్ర మంత్రులు వీరేంద్ర కుమార్‌, అర్జున్‌ ముండా వరుసగా రాజ్యాంగం (జమ్మూ కాశ్మీర్‌ షెడ్యూల్డ్‌ కులాల ఆర్డర్‌ (సవరణ) 2023 బిల్లు , జమ్మూ కాశ్మీర్‌ షెడ్యూల్డ్‌ తెగల ఆర్డర్‌ (సవరణ) బిల్లు 2023ని ప్రవేశపెట్టారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి గనులు, ఖనిజాల (డెవలప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌) సవరణ బిల్లు 2023 బిల్లుని ప్రవేశపెట్టారు. 

రివల్యూషనరీ సోషలిస్ట్‌ సార్టీకి చెందిన ఎన్‌.కె ప్రేమచంద్రన్‌ ఈ బిల్లును వ్రపేశపెట్టడాన్ని వ్యతిరేకించారు. ‘ఇది ఫెడరలిజం సూత్రానికి విరుద్ధమని ఆయన అన్నారు. ఇది ప్రభుత్వ రంగ సంస్థల భద్రతతోపాటు దేశ భద్రతపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన చెప్పారు. అయితే గనులు, ఖనిజాల చట్ట సవరణకు సంబంధించి పార్లమెంటు శాసన సామర్థ్యంపై ఎలాంటి అభ్యంతరాలు లేవని జోషి స్పష్టం చేశారు. వాయిస్‌ ఓటింగ్‌ అనంతరం ఈ బిల్లును జోషి ప్రవేశపెట్టారు.