రూ. 2.72 లక్షల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు వచ్చేశాయి

ఈ సంవత్సరం మే 19 వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ మధ్య మొత్తం  136.13 కోట్ల రూ. 2000 నోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయని కేంద్రం పార్లమెంట్ కు తెలిపింది. వాటి విలువ రూ. 2.72 లక్షల కోట్లు అని వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రూ. 2 వేల నోట్లను 2016 నవంబర్ 10 వ తేదీ నుంచి చెలామణిలోకి తీసుకువచ్చారు. 

4 లేదా 5 ఏళ్ల జీవిత కాలం ఉన్న రూ. 2 వేల నోట్లలో సుమారు 89% నోట్లను మార్చి 2017 నాటికే మార్కెట్లోకి విడుదల చేశారు. ఆ తర్వాత, ఇటీవల ఆర్బీఐ నిర్వహించిన ఒక సర్వేలో రూ. 2 వేల నోట్లను రోజువారీ లావాదేవీల్లో ప్రజలు ఎక్కువగా ఉపయోగించడం లేదని తేలింది. 

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర డినామినేషన్ల నోట్లు సరిపోతాయని, రూ. 2 వేల నోట్లు అవసరం లేదని స్పష్టమైంది. దాంతో, రూ. 2 వేల నోట్లను చెలామణి నుంచి తొలగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. రూ. 2 వేల నోట్లను ప్రజలు బ్యాంకుల్లో తమ ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. లేదా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. 

ఎక్స్చేంజ్ చేసుకోవడానికి రోజువారి పరిమితి రూ. 20 వేలు. బ్యాంకుల్లోని తమ ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవడానికి ఎలాంటి పరిమితి లేదు. ఎంత మొత్తమైనా తమ అకౌంట్లలో డిపాజిట్ చేసుకోవచ్చు. రూ. 2 వేల నోట్ల డిపాజిట్, లేదా ఎక్స్చేంజ్ కు చివరి తేదీ సెప్టెంబర్ 30. ఈ తేదీని పొడగించే ఆలోచన లేదని తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే, రూ. 500 నోటును కూడా రద్దు చేసే ఆలోచన కూడా లేదని తేల్చి చెప్పింది.