రుణాల‌ను వ‌సూలులో ప‌రుషంగా వ్య‌వ‌హ‌రించ‌కండి

రుణాల‌ను వ‌సూలు చేసే క్ర‌మంలో ప‌రుషంగా వ్య‌వ‌హ‌రించ‌రాద‌ని, ఈ త‌ర‌హా కేసుల‌ను సున్నితంగా, మాన‌వ‌త్వంతో డీల్ చేయాల‌ని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకుల‌కు సూచించారు.  చిరు వ్యాపారులు, రుణ గ్ర‌హీత‌ల రుణ చెల్లింపు ప్ర‌క్రియ‌కు సంబంధించి ప్ర‌శ్నోత్న‌రాల కార్య‌క్ర‌మంలో సోమ‌వారం మంత్రి సీతారామ‌న్ జోక్యం చేసుకుని కొన్ని బ్యాంకులు రుణాల రీపేమెంట్స్ విష‌యంలో ప‌రుషంగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు త‌న దృష్టికి వ‌చ్చింద‌ని చెప్పారు.

ఈ విష‌యంలో బ్యాంకులు ప‌రుషంగా వ్య‌వ‌హ‌రించ‌రాద‌ని మాన‌వ‌త్వంతో సున్నితంగా ఈ కేసుల‌ను డీల్ చేయాల‌ని బ్యాంకుల‌కు ప్ర‌భుత్వం సూచిస్తోంద‌ని తెలిపారు. చెల్లించాల్సిన రుణ మొత్తాన్ని బ్యాంకులు రికవ‌రీ చేయాల‌నుకుంటే చ‌ట్టంలో పొందుప‌రిచిన విధానం ప్ర‌కారం రిక‌వ‌రీ చేయాల‌ని మద్రాస్ హైకోర్ట్ గ‌త‌వారం స్ప‌ష్టం చేసింది.

బ్యాంకులు నియమించిన ప్రైవేట్ ఏజెంట్ల ద్వారా దౌర్జ‌న్యంగా రిక‌వ‌రీ ప్ర‌క్రియ చేప‌డితే దాన్ని అనుమ‌తించ‌బోమ‌ని కోర్టు తేల్చిచెప్పింది. రుణ మొత్తాన్ని రాబ‌ట్టేందుకు బ్యాంకులు అంగ‌బ‌లం ప్ర‌ద‌ర్శించ‌రాద‌ని పేర్కొంది. రిక‌వ‌రీ ఏజెంట్స్‌పై ఫిర్యాదులు వ‌స్తే ఏజెంట్ల నియామ‌కం చేప‌ట్ట‌కుండా బ్యాంకుల‌పై తాము నిషేధం విధిస్తామ‌ని ఆర్‌బీఐ 2008లో జారీ చేసిన స‌ర్క్యుల‌ర్‌లో బ్యాంకుల‌ను హెచ్చ‌రించింది.

20వేల ఎంఎస్‌ఎంఈల మూత

కాగా, దేశంలో గత మూడేండ్ల వ్యవధిలో ఏకంగా 20 వేల ఎంఎస్‌ఎంఈలు మూతపడ్డాయని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి భాను ప్రతాప్‌ సింగ్‌ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.  2020 జూలై నుంచి 2023 మార్చి మధ్య దేశంలో 19,687 ఎంఎస్‌ఎంఈలు మూతపడ్డట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. గత ఏడాదిలోనే 13,290 పరిశ్రమలు మూతపడ్డాయని చెప్పారు.