
ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత మరో భారీ ప్రయోగానికి ఇస్రో సిద్ధం అవుతోంది. తాజాగా ఇస్రో మరో వాణిజ్య రాకెట్ ప్రయోగాన్ని చేపడుతోంది. ఏపీలోని శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఈనెల 30న పీఎస్ఎల్వి సి–56 ప్రయోగాన్ని నిర్వహించనున్నారు.
ఈ ప్రయోగంలో 422 కిలోలు బరువు కలిగిన సింగపూర్‌కు చెందిన ఏడు ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. సింగపూర్ ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ ప్రధాన పేలోడ్ గా ఉండే కమర్షియల్ పీఎస్ ఎల్వీ మిషన్ లో ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) తరఫున ఏడు ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు ఇస్రో తెలిపింది.
వాణిజ్యపరంగా తక్కువ ఖర్చుతో విదేశీ ఉపగ్రహాలను పంపించే సౌకర్యం వుండడంతో చాలా దేశాలు భారత్ నుంచే ప్రయోగాలకు మొగ్గుచూపుతున్న విషయం తెలిసిందే. సింగపూర్ కి చెందిన 351 కిలోల డీఎస్- ఎస్ఎఆర్ (షార్ట్ ఫర్ సింథటిక్ ఆపార్చర్ రాడార్) అనే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, 23.58 కిలోలు బరువు కలిగిన ఆర్కేడ్, 23 కేజీల వెలాక్స్–ఏఎం, 12.8 కిలోలు బరువు కలిగిన ఓఆర్‌బీ–12 స్ట్రైడర్, 3.84 కేజీల బరువున్న గలాసియా–2, 4.1 కేజీల బరువైన స్కూబ్–11, 3.05 కేజీల నులయన్ అనే ఉపగ్రహాలను లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు.
ఈ ప్రయోగం పూర్తిగా వాణిజ్యపరమైనది అవడం విశేషం. సింగపూర్ ప్రభుత్వ ఏజెన్సీలకు ఉపగ్రహ ఛాయాచిత్రాల అవసరాల నిమిత్తం డీఎస్- ఎస్ఎఆర్ ని ప్రయోగిస్తున్నారు. సింగపూర్ కు చెందిన డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ (డిఎస్టిఎ), ఎస్ టి జినీరింగ్ భాగస్వామ్యంతో డీఎస్-ఎస్ఏఆర్ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశారు.
More Stories
మూడురోజుల పాటు తిరుపతిలో టెంపుల్ ఎక్స్పో
గుంటూరు ఆసుపత్రిలో జిబిఎస్ తో ఓ మహిళ మృతి
అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూత