మంత్రాలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టకు అమిత్ షా భూమి పూజ

పవిత్ర మంత్రాలయ క్షేత్రంలో జైశ్రీరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  దాదాపు రూ.250 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు కానున్న 108 అడుగుల శ్రీరాముని పంచలోహ విగ్రహానికి ఆదివారం భూమి పూజ నిర్వహించారు. సాయంత్రం రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆధ్వర్యంలో అమిత్‌షా ఢిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మఠం, జైశ్రీరామ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పదెకరాల స్థలంలో రెండేళ్ల అనంతరం విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వ జన్మ సుకృతమని అమిత్ షా చెప్పారు. గుజరాత్ రాష్ట్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని రూపొందించిన శిల్పి రామ్ వాంజీ సుతార్‌కు శ్రీరాముని విగ్రహ రూపకల్పన బాధ్యతను అప్పగించారు. విగ్రహ నమూనాను ఆయన ప్రాథమికంగా ఖరారు చేశారు. ఆ నమూనా ఆధారంగా రూపొందించిన చిన్న విగ్రహంతో నేడు శంకుస్థాపన చేశారు. ఇక రెండేళ్ల సమయంలో 108 ఫీట్ల పంచలోహ విగ్రహం తయారు చేసిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. అంతేగాక, ఆ విగ్రహానికి ముందు రామాలయం నిర్మిస్తారు.

 
మంత్రాలయం శ్రీమఠానికి సుమారు కిలోమీటర్ దూరంలో 10 ఎకరాల స్థలంలో ఆలయ నిర్మాణం జరగనుంది. పూర్తిస్థాయి రాతి కట్టడంలా ఈ రామాలయాన్ని తీర్చిదిద్దనున్నారు. ఆలయ ఆకృతుల రూపకల్పనల్లో ప్రముఖుడైన డాక్టర్ ఎ వేలుకు ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి, కాశీలోని విశ్వనాథ ఆలయం, సింహాచలంలోని నరసింహస్వామి, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయం, కేరళ అనంత పద్మనాభస్వామి ఆలయం, బాసర జ్ఞానసరస్వతి ఆలయం, కర్ణాటక చెలువ నారాయణస్వామి ఆలయం, తమిళనాడు మూషణం వరాహస్వామి ఆలయం, మహారాష్ట్రలోని విరోభా రుక్మిణి ఆలయాలను తలపించే చిన్నపాటి ఆలయాలనూ ఈ పది ఎకరాల స్థలంలోనే నిర్మించనున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ మాట్లాడుతూ, పవిత్ర తుంగభద్రా నది తీరాన 108 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలనుకోవడం ఎంతో అభినందించదగ్గ విషయం అని చెప్పారు. శ్రీరాముని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు.

చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడని అంటూరాజ్యపాలనలో ప్రజలను కన్నబిడ్డల చూసుకుంటూ ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి శ్రీరామచంద్రుడుగా పేర్కొన్నారు. అటువంటి మర్యాద పురుషోత్తమని విగ్రహాన్ని పవిత్ర మంత్రాలయ క్షేత్రంలో ఏర్పాటు చేయడం మన ప్రాంతవాసుల అదృష్టమని చెప్పారు. ఈ విగ్రహం ఏర్పాటుకు ముందుకు వచ్చిన జైశ్రీరామ్ ఫౌండేషన్ వారు అత్యంత అభినందనీయులుగా తెలిపారు.