నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకేసారి 6 మంది మృతి!

నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో (జీజీహెచ్‌) ఒకరోజే ఆరుగురు మృతి చెందడం కలకలం రేపింది. ఆరుగురు చనిపోయినట్లు అధికారులు ప్రకటించినా వాస్తవంగా 8 మంది చనిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకేరోజు ఇంత మంది చనిపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోగులు తీవ్రమైన అనారోగ్య కారణాల వల్లే మృత్యువాత పడినట్లు వైద్యులు వెల్లడించారు. 

ప్రతిరోజు ఆసుపత్రిలో ఇద్దరు, ముగ్గురు మృతి చెందుతూ ఉంటారని చెబుతున్నారు. మృతులంతా 50 ఏళ్ల పైబడిన వారేనని ప్రకటించారు. చనిపోయిన వారిలో నెల్లూరు నగరం స్టోన్‌హౌస్‌పేటకు చెందిన ఎస్‌ లలిత (62), శ్రీనివాసనగర్‌కు చెందిన ఎన్‌. చలపతి(52), వేదాయపాలెంకు చెందిన వై. సుందరం(70), కోటమిట్టకు చెందిన చెంచమ్మ(70), తోటపల్లి గూడూరు మండలం నరుకూరుకు చెందిన పి. రమేష్‌(42)తో పాటు సాంబయ్య ఉన్నట్టు అధికారులు ధ్రువీకరిస్తున్నారు.

అయితే ఒకరోజు అంత మంది చనిపోవడం, ఆ విషయాన్ని బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఈ కథనాల నేపధ్యంలో జిల్లా కలెక్టర్‌ ఎం. హరినారాయణన్‌తో పాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎం. పెంచలయ్య, సంబంధిత శాఖల అధికారులందరూ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.  జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఆక్సిజన్‌ అందక ఆరుగురు చనిపోయారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, వారంతా అనారోగ్యంతో చనిపోయారని డాక్టర్లు నిర్ధారించారని కలెక్టర్‌ ఎం. హరినారాయణన్‌ స్పష్టం చేశారు.

 ప్రసార మాధ్యమాల్లో జీజీహెచ్‌లో జరిగిన ఘటనపై వచ్చిన కథనాల నేపధ్యంలో ఆయన శనివారం సాయంత్రం జిల్లా ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఎంఐసీయు వార్డును, ఆక్సిజన్‌ ప్లాంట్‌ను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులు కూడా ఆసుపత్రిలో బాగా చూస్తున్నారని, వైద్యులు అందుబాటులో ఉంటున్నారని ఆయనకు తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ విలేకర్లతో మాట్లాడుతూ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై డీఎంఅండ్‌హెచ్‌ఓ, సూపరింటెండెంట్‌తో పూర్తి స్థాయిలో విచారణ జరిపించామని చెప్పారు. ఎంఐసీయులో అత్యవసర కేసులకు వైద్య చికిత్సలు అందుతున్నాయని, వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండి రోగులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఆక్సిజన్‌ కొరత లేదని, 23 కె.ఎల్‌ లిక్విడ్‌ ఆక్సిజన్‌ 24 గంటలు అందుబాటులో ఉందని, పైపులైన్‌ల ద్వారా పూర్తి స్థాయిలో సరఫరా జరుగుతుందని తెలిపారు.