జేష్ఠ ఆర్ఎస్ఎస్ నేత మదన్ దాస్ దేవి మృతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) జేష్ఠ నేత, పూర్వ సహా సర్ కార్యవాహ మదన్ దాస్ దేవి (81) సోమవారం ఉదయం బెంగుళూరులో మృతి చెందారు. అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ లో సుదీర్ఘకాలం జాతీయ సంఘటన కార్యదర్శిగా పనిచేసి, సంస్థాగతంగా దానిని దేశవ్యాప్తంగా విస్తరింపచేసి, బలమైన విద్యార్ధి ఉద్యమంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర వహించిన ఆయన కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బెంగుళూరులో చికిత్స పొందుతున్నారు.
 
చార్టర్డ్ అకౌంటెన్సీ చదివిన తర్వాత ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా వచ్చిన ఆయన బెంగుళూరులోని రాష్ట్రోత్తన్ ఆసుపత్రిలో మరణించారు. ఆయన  భౌతికకాయాన్ని సోమవారం బెంగుళూరులోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం కేశవ కృపాలో ఉంచి, సాయంత్రం పూణేకు తరలిస్తున్నారు. మంగళవారం అక్కడనే అంత్యక్రియలు జరుపనున్నారు. 
ఆర్ఎస్ఎస్, బీజేపీ లలో నేటి పలువురు అగ్రశ్రేణి నాయకులను ఆయనే తీర్చిదిద్దారు. ముఖ్యంగా యువతలో నాయకత్వం నైపుణ్యం పెంపొందించడంలో ప్రావీణ్యత పొందారు. భారత దేశ స్వరూపాన్ని మార్చివేసిన బీహార్ ఉద్యమం, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం,  ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం, ఆ తర్వాత దేశంలో వివిధ ప్రాంతాలలో జరిగిన పలు జాతీయ ఉద్యమాలలో యువతకు మార్గనిర్ధేశం చేశారు. ఆయన 1967 నుండి 1990 వరకు ఎబివిపి సంఘటనా  కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ లో పలు బాధ్యతలు చేపట్టారు.
 
ఆయన మృతికి సంతాపం తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ.. “శ్రీ మదన్  దాస్ దేవి జీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి చెందాను. ఆయన తన జీవితమంతా దేశసేవకే అంకితం చేశారు. ఆయనతో సన్నిహితంగా మెలగడమే కాకుండా ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం నాకు కలిగింది. ఈ దుఃఖ క్షణాన కార్యకర్తలు అందరికి, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి” అని నివాళులు అర్పించారు.
 
ఆర్ఎస్ఎస్ ఒక సందేశంలో, “రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సీనియర్ ప్రచారక్ శ్రీ మదన్ దాస్ దేవి బెంగళూరులోని రాష్ట్రోత్తన్ ఆసుపత్రిలో ఉదయం 5 గంటలకు కన్నుమూశారు. ఆయనకు 81 సంవత్సరాలు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అఖిల భారత సంఘటనా కార్యదర్శిగా, సంఘ్ సహ సర్ కార్యవాహగా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు” అని సంతాపం తెలిపింది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు తదితరులు కూడా ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు.
 
మదన్ దాస్ మృతి పట్ల ఎబివిపి మాజీ జాతీయ ఉపాధ్యక్షులు, కేరళ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ వి శేషగిరి రావు, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఎబివిపిని ఒక బలీయమైన విద్యార్ధి ఉద్యమంగా మలిచారని, దేశంలో వేలాదిమంది కార్యకర్తల జీవితాలను తీర్చి దిద్దారని, మార్గదర్శనం చేశారని వారు నివాళులు అర్పించారు. ఆయన లేని లోటు పూరించడం కష్టం అని చెప్పారు.