జ్ఞానవాపి మసీదులో సర్వేపై సుప్రీంకోర్టు స్టే

జ్ఞానవాపి మసీదులో సోమవారం ఉదయం ప్రారంభమైన భారత పురావస్తు శాఖ సర్వేను ఆపాలంటూ సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ నెల 26 వరకు సర్వే పనులు ఆపాలంటూ ఆదేశించింది. శాస్త్రీయ సర్వే చేపట్టాలన్న వారణాసి కోర్టు ఉత్తర్వులపై మసీదు నిర్వహణ కమిటీ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 
 
వెంటనే దీనిపై విచారణ చేపట్టాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈరోజు విచారణ జరిపిన చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం . సర్వే చేపట్టాలంటూ వారణాసిలోని జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై రెండు రోజుల పాటు స్టే విధించింది. మసీదులో బుధవారం సాయంత్రం 5.00 గంటల వరకు సర్వే పనులు ఆపాలంటూ ఆదేశించింది.
 
జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిందని, దానిపై సర్వే చేపట్టాలని హిందువులు పిటిషన్​ వేశారు. ఈ వ్యాజ్యంపై స్పందించిన వారణాసి కోర్టు.. శివలింగం బయటపడిన ‘వుజుఖానా’ను మినహాయించి, మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వేచేపట్టాలని ఏఎస్​ఐకు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 7 గంటలు సర్వే మొదలుపెట్టింది ఏఎస్ఐ.

“జ్ఞానవాపి మసీదు చాలా పురాతనమైనది. ఇక్కడ సర్వే పేరుతో తవ్వకాలు చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే మసీదు దెబ్బతింటుంది. వెంటనే సర్వేను ఆపండి,” అని మసీదు కమిటీ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు ఎదుట వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన కేంద్రం తరఫు న్యాయవాదులు.. “మసీదులో నుంచి ఒక్క ఇటుకను కూడా తొలగించము. తవ్వకాలు చేపట్టే ప్రణాళికే లేదు. ఫొటొగ్రఫీ, కొలతలు, రాడార్​ స్టడీస్​ కోసమే ఈ సర్వే చేపడుతున్నారు,” అని విన్నవించారు.

ఇరు పక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం.. జ్ఞానవాపి మసీదులో సర్వేను బుధవారం సాయంత్రం 5 గంటల వరకు నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. అలహాబాద్​ హైకోర్టు ఈ వ్యవహారంపై బుధవారం విచారణ చేపట్టాలని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

పురాతన హిందూ ఆలయాన్ని తొలగించిన తర్వాత, ఆ స్థానంలో జ్ఞానవాపి మసీదును నిర్మించారని నలుగురు మహిళలు గతేడాది కోర్టు మెట్లు ఎక్కారు. ఆ ప్రాంగణంలో శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలని పిటిషన్​ దాఖలు చేశారు. అంతకుముందు మసీదులోని శ్రీనగర్​ గౌరి ఆలయంలో ఏడాది పాటు పూజలు చేసుకునే విధంగా అనుమతులివ్వాలంటూ 2021లో మరో పిటిషన్​ దాఖలైంది.

 వీటిపై గత కొన్నేళ్లుగా విచారణ జరుగుతోంది. గతేడాది ఆ మసీదు ప్రాంగణంలో వీడియోగ్రాఫిక్​ సర్వే జరిగింది. ఇందులో శివలింగం బయటపడిందని చెబుతున్నారు. అప్పట్లో ఇది ఓ సంచలన వార్త. శివలింగంగా చెబుతున్న ఈ ఆకారంపైనా శాస్త్రీయ సర్వే చేపట్టాలని కొన్ని నెలల క్రితం అలహాబాద్​ హైకోర్టు ఏఎస్​ఐకి ఆదేశాలిచ్చింది.

 దీనిని ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు నిలిపివేసింది. కాగా మసీదులో సర్వే నిర్వహించాలని, ఇది అత్యావసరమని, దీనితో నిజాలు బయటపడతాయని స్థానిక కోర్టు శుక్రవారం ఆదేశాలిచ్చింది. దీనిని తాజాగా సుప్రీంకోర్టు నిలిపివేసింది.