అవినీతిపై కవిత మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టే

అవినీతిపై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని నిజామాబాద్ మున్సిపల్ బిజెపి ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి ఎద్దేవా చేశారు.  ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అర్వింద్ ని వెంటాడి ఓడిస్తానన్న కవిత ఇప్పుడు మాటలు మార్చి, అరవింద్ మీద ఎవరు నిలబడ్డా బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నాని ఆమె ధ్వజమెత్తారు. ఎం
 
పీ అరవింద్ తనపై చేసిన అవినీతి గురించి 24 గంటలలో రుజువు చేయాలని, లేకపోతే పూలాంగ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాయలన్న కవిత వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు.  కవిత ఎంపీగా ఉన్నప్పుడు, తండ్రి సీఎంగా ఉన్నప్పటికీ జిల్లాకు కవిత చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు.  మాధవ్ నగర్ ఆర్ఓబి పనులకు సంబంధించిన కాంట్రాక్టర్ ఈమె కమిషన్లకు భయపడి పారిపోయిన మాట వాస్తవం కాదా? అని ఆమె ప్రశ్నించారు. మాధవ్ నగర్ , ఆర్మూర్ మామిడిపల్లి, అడవి మామిడిపల్లి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆమె చెప్పారు. 
 
అర్సపల్లి ఆర్ఓబి కి సైతం రూ. 137.5 కోట్లు మంజూరు చేయించుకున్న ఘనత అరవింద్ కే దక్కుతుందని ఆమె తెలిపారు. ఈడి విడుదల చేసిన సప్లమెంటరీ చార్జిషీట్లో కవిత భర్త అనిల్ కుమార్ పేరు ఉందని, మీడియా సంస్థలు కూడా వీటిని ప్రసారం చేశాయని ఆమె గుర్తు చేశారు.  ఈడి విడుదల చేసిన సప్లమెంటరీ చార్జిషీట్లో కవిత పేరుందని పేర్కొంటూ అవినీతి చేసిన ప్రతి ఒక్కరూ జైలుకే వెళ్తారని ఎంపీ అర్వింద్ అన్నారని, అందులో తప్పేముందని స్రవంతి రెడ్డి ప్రశ్నించారు. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పంచరెడ్డి ప్రవళిక , కార్పొరేటర్లు సౌజన్య, మమత, ఇందిరా కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.