
ఓ భారతీయ యువకుడి ప్రేమలో పడి, భర్తను వదిలేసి, స్వస్థలంలో ఆస్తిని అమ్ముకొని నలుగురు పిల్లలతో భారత్ లోకి అక్రమంగా ప్రవేశించినట్లు విశేష ప్రచారం పొందుతున్న పాకిస్థాన్ మహిళా సీమా హైదర్ వాస్తవానికి పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ అని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ విషయమై లోతుగా దర్యాప్తు జరుపుతున్నాయి.
పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ (30), ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆమె ప్రియుడు సచిన్ మీనా (22) లవ్ స్టోరీపై ఉత్తరప్రదేశ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా వారిద్దరూ కలిసి బస చేసిన నేపాల్ రాజధాని ఖాట్మండు హోటల్‌లోని రూమ్ నంబర్ 204పై దృష్టి సారించారు. సీమా హైదర్, గ్రేటర్ నోయిడాలోని రబుపురా ప్రాంతానికి చెందిన సచిన్ మీనాకు 2019లో ఆన్‌లైన్ గేమ్ పబ్జీ ద్వారా పరిచయం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో మే నెలలో వారిద్దరూ నేపాల్‌లో కలుసుకున్నారు. ఖాట్మండుకు ముందుగా చేరుకున్న సచిన్, న్యూ వినాయక్ హోటల్‌లో రూమ్ నంబర్ 204ను బుక్ చేశాడు. తన భార్య కూడా వస్తున్నట్లు హోటల్ సిబ్బందికి చెప్పాడు. రిజిస్టర్‌లో తప్పుడు పేర్లు పేర్కొన్నారు. ఎలాంటి ఐడీ కార్డులు చూపించలేదు.
పాకిస్థాన్‌లోని ముస్లిం కుటుంబానికి చెందిన సీమా హైదర్ అచ్చంగా భారతీయ మహిళగా మేకప్ వేసుకుంది. సచిన్‌తో కలిసి నేపాల్‌లో షికార్లకు వెళ్లింది.
హోటల్‌లో వారం రోజులు బస చేసిన తర్వాత వారిద్దరూ క్యాబ్‌లో పోఖరా ప్రాంతానికి వెళ్లారు. అక్కడి నుంచి సచిన్‌తో కలిసి సీమా అక్రమ మార్గంలో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చేరుకుంది.
వారిద్దరూ నేపాల్ లోనే వివాహం చేసుకున్నామని చెబుతున్నారు. ఆమె భర్త గులాం హైదర్ దుబాయిలో నివాసం ఉంటున్నాడు. మరోవైపు ఈ నెల 4న సీమా హైదర్, సచిన్ మీనా తమ లవ్ స్టోరీ గురించి మీడియాకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన ఆ మహిళ ఎలాంటి వీసా, పత్రాలు లేకుండా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు.
ఈ నెల 7న ఆ జంటకు స్థానిక కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే సీమా హైదర్ సోదరుడు, బాబాయి పాకిస్థాన్ ఆర్మీలో పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆమె పాక్ ఐఎస్ఐ ఏజెంట్ అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. చదువుకొని గ్రామీణ మహిళా అని చెబుతున్న ఆమె అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడటం, ఒంటరిగా విదేశీ పర్యటనలు జరపటం, కంప్యూటర్ వాడకం బాగా తెలియడం గమనిస్తే ఆమె శిక్షణ పొందిన పాకిస్తాన్ గూఢచారిగా భావిస్తున్నారు.
అయితే, తాను నిఘా ఏజెంట్ ను గాని, ఉగ్రవాదిని గాని కాదని, ఓ సాధారణ మహిళను అని, హిందూ మత సంప్రదాయాల పట్ల ఆకర్షితులై అనుసరిస్తున్నల్టు ఆమె చెబుతున్నారు. మాంసాహారం మనైవేసిన్నట్లు చెబుతూ తనను తిరిగి పాక్ కు పంపితే తనను చంపేస్తారని ఆమె భయం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఉండగా, ఒక సాధారణ పాకిస్థాన్ మహిళా ఎటువంటి పత్రాలు లేకుండా, నిఘా వర్గాల కంట పడకుండా సరిహద్దు దాటి, నలుగురు పిల్లలతో భారత్ లోకి ప్రవేశించ గలిగింది అంటూ మాజీ యుపి డిజిపి విక్రమ్ సింగ్ విస్మయం వ్యక్తం చేశారు. లోతుగా దర్యాప్తు చేయాల్సిందే అని స్పష్టం చేశారు. ఒక సాధారణ భారతీయుడు ఆ విధంగా పాకిస్థాన్ వెళ్లగలడా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఉగ్రవాద నిరోధక పోలీసులు సీమా, సచిన్‌ను రహస్య ప్రాంతానికి తరలించి ప్రశ్నిస్తున్నారు. సీమా చాలా ఆలస్యంగా 2022 సెప్టెంబర్ 20న తీసుకున్న పాకిస్థాన్ పౌర పత్రం, ఆమె పాస్‌పోర్ట్, ఆధార్‌కార్డు, నలుగురు పిల్లలకు సంబంధించిన ఇతర పత్రాలను కూడా పరిశీలిస్తున్నారు. సీమా హైదర్ ఒక వేషధారణ మార్చుకోవడమే కాదు, భాష నైపుణ్యాలు కూడా ఉన్నాయని, అనర్గళంగా మాట్లాడుతోందని రిపోర్టులు చెబుతున్నాయి. నేపాల్‌లో క్రియాశీలకంగా పనిచేస్తున్న పాకిస్తానీ నిర్వహకులు ఆమెకు శిక్షణ ఇచ్చి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
More Stories
సామరస్యపూర్వక, వ్యవస్థీకృత హిందూ సమాజ నిర్మాణం
మహారాణి అబ్బక్కకు ఆర్ఎస్ఎస్ ఘనంగా నివాళులు
`సర్వ స్పర్శి, సర్వవ్యాపి’గా ఆర్ఎస్ఎస్ అన్ని అంశాల స్పృశి