ఏపీని అప్పుల ఆంధ్రగా మార్చిన జగన్

వైఎస్ సర్కారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని  ఏపీ అప్పుల ఆంధ్రగా, అంధకార ఆంధ్రప్రదేశ్‌గా మార్చివేసింది బీజేపీ ఏపీ అధ్యక్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వరి మండిపడ్డారు. అధికారికంగా చేసే అప్పులకు తోడు అనధికారిక మార్గాల ద్వారా కూడా భారీ మొత్తంలో అప్పులు చేస్తోంది ఆమె ఆరోపించారు. అనధికారికంగా తీసుకువస్తున్న అప్పులపై జగన్మోహన్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

ఏపీపై విభజన నాటికి రూ.97వేల‌ కోట్ల భారం ఉందని ఆమె చెప్పారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో‌ రూ.2,65,365 కోట్లు అప్పు చేయగా, నలభై వేల కోట్లు కాంట్రాక్టర్‌లకు బిల్లులు చెల్లించలేదని ఆమె తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జులై వరకు నాలుగేళ్లల్లో రూ.7,14,631 కోట్లు అప్పు చేశారని పురందేశ్వరి వెల్లడించారు. 

రూ.2లక్షల 39వేల 716 కోట్లు అధికారికంగా, రూ.4లక్షల 74వేల 315 కోట్లు అనధికారికంగా అప్పు తెచ్చారని ఆమె తెలిపారు. ఈ అనధికార అప్పే నేడు ఏపీ అభివృద్ధికి నిరోధకంగా మారిందని ఆమె వెల్లడించారు మద్యం అమ్మకాలపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని పూచికత్తుగా చూపి రూ.8 వేల కోట్లకు పైగా ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చిందని ఆమె చెప్పారు.

ఉద్యోగులను తాకట్టు పెట్టి, ప్రభుత్వ సంస్థలను పెట్టి అప్పులు చేశారని విమర్శించారు. గ్రామ పంచాయతీ నిధులు మళ్లించారని,  స్టేట్ డిజార్డర్స్ ఫండ్ కూడా మళ్లించేశారని ఆమె మండిపడ్డారు. సింకింగ్ ఫండ్‌ను కూడా వదిలి పెట్టలేదన్నారు. ఉద్యోగుల పి.ఏఫ్ నుంచి, ఇ.యస్.ఐ నుంచి, జనరల్ పీఎఫ్ నుంచి ఇలా అనేక మార్గాల్లో అనధికారికంగా రూ. 4,74,315 కోట్లు తెచ్చారని పురందేశ్వరి వివరించారు.

ఈ మొత్తానికి రిజర్వ్ బ్యాంకు నుంచి అధికారికంగా తీసుకున్న అప్పులు అదనమని ఆమె చెప్పారు. ఈ అప్పులకు వడ్డీ రూపంలో రూ.50 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందని మాజీ కేంద్ర మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆదాయంలో దాదాపు 40 శాతం వడ్డీలు చెల్లించడానికే ఖర్చు చేయాల్సి వస్తే ఇక రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఎలా చేయగలరని ఆమె ప్రశ్నించారు. 

కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను కూడా జగన్ ప్రభుత్వం దారిమళ్లిస్తోందని పురందేశ్వరి ఆరోపించారు. రాష్ట్రం సేకరించి పంపే పన్నుల ఆదాయంలో 42 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం వివిధ మార్గాలలో తిరిగిచ్చేస్తోందని ఆమె చెప్పారు. యూపీఏ పాలనలో కేవలం 32 శాతం ఆదాయమే రాష్ట్రాలకు తిరిగివచ్చేదని ఆమె గుర్తుచేశారు. 

కాగా, జగన్ సర్కారు ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి అప్పులు చేస్తోందని ఆమె మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్ లో పెడుతూ వారిని ఇబ్బంది పెడుతోందని చెబుతూ కొంతమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారని పురందేశ్వరి చెప్పారు. దీనిని బట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆమె మండిపడ్డారు.

ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న గ్రామ సర్పంచ్ లకు వైసీపీ ప్రభుత్వం విలువ లేకుండా చేసిందని పురంధేశ్వరి ఆరోపించారు. సర్పంచ్ లో ఖతాల్లో వేసిన డబ్బులను మళ్లించిన ఘటన సీఎం జగన్ కే చెల్లుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసానికి పార్టీలకు అతీతంగా సర్పంచ్ లో ఒకే వేదికపైకి వచ్చి పోరాడుతున్నారని ఆమె చెప్పారు.

 ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయంగా చెందాల్సిన బెన్‌ఫిట్‌లు ఇవ్వకుండా నిధులు మళ్లించారని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే భయపడేలా చేశారని పేర్కొన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు భరోసా లేకుండా పోయిందని ఆమె విమర్శించారు. జీతాలు ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు. 

రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తీసుకున్న అప్పుల వరకే కేంద్రం బాధ్యత ఉందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. అనధికార అప్పులతో కేంద్రానికి సంబంధం లేదని చెప్పారు. సీఎం జగన్ ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కుంటున్నారని పురంధేశ్వరి విమర్శించారు. కేంద్రానికి ఏపీ ఆర్థిక పరిస్థితిని వివరిస్తామని వెల్లడించారు.