ఎడతెరిపి లేని వానలతో తెలంగాణ రైతుల హర్షం

గత మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వ్యవసాయ రంగానికి మేలు చేస్తున్నాయి. దీంతో మొన్నటివరకూ ఆందోళన చెందిన రైతాంగంలో ఆశలు చిగురిస్తున్నాయి. గోదావరి నదిలో వరద నీరు నానాటికీ పెరుగుతుండడంతో ఆయకట్టు రైతులు కొండంత ఆశతో పొలం పనులు మొదలుపెట్టారు. 

మరోవైపు వర్షాల రాకతో గ్రామాల్లో సందడి వాతావరణ నెలకొంది. చెరువులు, కుంటల్లో క్రమేపీ నీరు చేరుతోంది.  రాష్ట్ర మంతటా గడిచిన 24గంటలుగా 27.6మి.మి సగటు వర్షపాతం నమోదైంది. ఈ వర్షాకాలంలో ఇప్పటివరకూ 254.3 మి.మి వర్షపాతం నమోదు కావాల్సివుండగా, గత మూడు రోజుల నుంచి ముసురుపట్టి కురుస్తున్న ఈ వర్షాలతో ఇప్పటివరకూ రాష్ట్ర సగటు వర్షపాతం 230.4 మిల్లీ మీటర్లకు చేరుకుంది.

బుధవారం అత్యధికంగా అదిలాబాద్ జిల్లాలో 53.3 మి.మి వర్షం కుసిరింది. దీంతో దుక్కి దున్ని పంటలకు సిద్ధం చేసుకున్న భూముల్లో విత్తనాలు వేసేందుకు రైతులు సంసిద్ధమవుతున్నారు. మరోవైపు ప్రాజెక్టులు, నదీ పరివాహక ప్రాంతాల్లో ధాన్యం పండించే రైతులంతా వరి నారుమళ్ళు వేసేందుకు చొరవ చూపుతున్నారు. 

నిన్న, మొన్నటి వరకు కొనుగోలు చేసిన విత్తనాలు ఏం చేయాలో తెలియక ఆందోళన చెందిన వారంతా ఇప్పుడు చేతికి పని చెబుతున్నారు. ఈ వర్షాలు ఇంకొన్ని రోజులు కొనసాగితే కృష్ణా పరివాహక ప్రాంతంలోనూ సాగు పరిస్థితులు ఆశాజనకంగా మారనున్నాయి. పక్షం రోజుల ముందుగానే పంట పెట్టుబడి కోసం రైతుబంధు పథకం నిధులు కూడా ఖాతాల్లో జమ కావడంతో చిన్న, సన్నకారు రైతులంతా ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. 

కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లో వాగుల్లోకి భారీగా నీరు చేరుతుండడంతో గ్రామాల మధ్య రాకపోకలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాగే పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడలు, ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వర్షాలు ఊపందుకోవడంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చిచేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు 4280 క్యూసెక్కుల వరద వస్తున్నట్లుగా బుధవారం మధ్యాహ్నం అధికారులు వెల్లడించారు. 

జలాశయంలో ప్రస్తుతం 689.42 అడుగుల వద్ద నీటిమట్టం ఉండగా, పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులుగా ఉంది. ఇక స్వర్ణ ప్రాజెక్టుకు 890 క్యూసెక్కుల వరద వస్తుండటంతో నీటిమట్టం 1164 అడుగులకు చేరింది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1189 అడుగులుగా ఉంది.  కాగా, భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 26.7 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జలవనరుల శాఖ హెచ్చరించింది. 

సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకి వరద కొనసాగుతోంది. సింగూరు ప్రాజెక్టుకు ప్రస్తుతం 2847 క్యూసెక్కుల వరద వస్తుండగా, 405 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తి నీటిసామర్థం 29.917 టీఎంసీలు కాగా, బుధవారం మధ్యాహ్నానికి 18.640 టీఎంసీలకు చేరుకుంది.

రాజధాని నగరం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఎడతెరిపి లేని వానల కారణంగా ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మరోవైపు వచ్చే మూడు రోజులూ పరిస్థితులు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్‌లో ఉదయం నుంచి రోజంతా ఎడతెరిపి లేని వర్షం కురిసింది.

 దీంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన ప్రజలు అవస్థలు పడ్డారు. బేగంబజార్‌, కోఠి, సుల్తాన్‌ బజార్‌, అబిడ్స్‌, నాంపల్లి, బషీర్‌బాగ్‌, లిబర్టీ, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, లక్డీకపూల్‌ తదితర ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరింది. ఈ క్రమంలోనే రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు..