పార్లమెంట్ లో మణిపూర్ పై చర్చకు కేంద్రం సిద్ధం

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మణిపూర్‌ అల్లర్లపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ అంశంపై పార్లమెంటులో చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టగా అందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం ప్రకటించింది. గురువారం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.  ‘ఇండియా’ పేరిట కూటమిగా ఏర్పడిన ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో ఉమ్మడిగా అంశాలు లేవనెత్తనున్నాయి.
ముఖ్యంగా మణిపూర్‌ అల్లర్లు, నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, గవర్నర్ల వ్యవస్థ వంటి అంశాలను లేనెత్తాలని ఇప్పటికే నిర్ణయించాయి.
ఆగస్టు 11 వరకు జరిగే ఈ సమావేశాల్లో 17 రోజుల పాటు సమావేశమవుతుంది. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభానికి ముందు రోజు ఆనవాయితీగా జరిపే అఖిలపక్ష సమావేశం పార్లమెంట్‌ లైబ్రరీ బిల్డింగ్‌లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన బుధవారం జరిగింది. 
 
ఈ సమావేశానికి పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న 34 రాజకీయ పార్టీల నుంచి 44 మంది నాయకులు హాజరయ్యారు. ధరలు పెరుగుదల, నిరుద్యోగం, కుల గణన, మహిళా రిజర్వేషన్‌ బిల్లు, మణిపూర్‌ అల్లర్లు, బాలసోర్‌ రైలు ప్రమాదం, ప్రతిపక్షాలపై ఈడి, సిబిఐ దుర్వినియోగం, ఎన్నికైన ప్రభుత్వాలపై గవర్నర్ల ఆధిపత్యం, సమాఖ్యవాదంపై దాడి, ఢిల్లీ ఆర్డినెన్స్‌ వంటి అంశాలపై ఈ సమావేశాల్లో చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. 
 
అలాగే మణిపూర్‌లో పరిస్థితి కూడా పార్లమెంటరీ బిజినెస్‌లో చేర్చాలని కోరాయి. దీనికి తాము సిద్ధమేనని అధికార పార్టీ తరపు ప్రతినిధులు చెప్పారు. కాగా, కేంద్రం 31 బిల్లులను ప్రతిపాదించింది.  వీటిలో గవర్నమెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ (సవరణ) బిల్లు, అటవీ సంరక్షణ సవరణ బిల్లు, డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు, జీవ వైవిధ్య (సవరణ) బిల్లు వంటివి ఉన్నాయి.
 
పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బుధవారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. అన్ని అంశాలపై చర్చించేందుకు, లేవనెత్తడానికి అవకాశం ఇస్తామని, పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని మంత్రులు కోరారు.
 
మణిపూర్‌ అల్లర్లపై ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రకటన చేయాలని కాంగ్రె్‌సతో సహా అనేక పార్టీలు డిమాండ్‌ చేశాయి. ఉమ్మడి పౌరస్మృతి బిల్లును తీసుకొస్తారన్న వార్తల నేపథ్యంలో ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్షాలు కేంద్రాన్ని కోరాయి. మహిళా రిజర్వేషన్‌ బిల్లుతో పాటు ఒడిశాకు ప్రత్యేక హోదా బిల్లును ప్రవేశపెట్టాలని బీజేడీ ప్రతిపాదించింది.
 
ప్రతిపక్షాల నుండి తాము చాలా ముఖ్యమైన సలహాలు పొందామని, 31 బిల్లులను జాబితా చేశామనిపార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. మణిపూర్‌ అల్లర్లపై ఎక్కువ మంది సభ్యులు లేవనెత్తారని, దానిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు.
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రులు అర్జున్‌ రాం మేఘ్వాల్‌, మురళీధరన్‌, జైరాం రమేష్‌, ప్రమోద్‌ తివారీ (కాంగ్రెస్‌), టిఆర్‌ బాలు, తిరుచ్చి శివ (డిఎంకె), ఎలమరం కరీం, పిఆర్‌ నటరాజన్‌ (సిపిఎం), విజయసాయి రెడ్డి (వైసిపి), గల్లా జయదేవ్‌, కనకమేడల రవీంద్ర కుమార్‌ (టిడిపి), కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు (బిఆర్‌ఎస్‌), సంజరు సింగ్‌ (ఆప్‌), రామ్‌ గోపాల్‌ యాదవ్‌ (ఎస్‌పి), మనోజ్‌ కుమార్‌ ఝా (ఆర్‌జెడి), సంతోష్‌ కుమార్‌ (సిపిఐ), ఎన్‌కె ప్రేమ్‌ చంద్రన్‌ (ఆర్‌ఎస్‌పి), తంబిదొరై (అన్నాడిఎంకె), ఈటి మహ్మద్‌ బషీర్‌ (ఐయుఎంఎల్‌) తదితరులు ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. 
ముందు పాత పార్లమెంట్ భవనంలోనే ఆరంభమయ్యే ఈ సెషన్ తరువాతి దశలో కొత్త పార్లమెంట్‌లోకి మారుతుంది. లోక్‌సభ సచివాలయం తెలిపిన వివరాల మేరకు ఈసారి 21 కొత్త బిల్లులు, ఏడు పాత బిల్లులను చర్చకు జాబితాలో పెట్టినట్లు వెల్లడైంది. ఇందులో డిజిట్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు , అటవీ పరిరక్షణ సవరణల బిల్లు, జన్‌విశ్వాస్ బిల్లు , ఎస్‌సి ఎస్‌టి సవరణల బిల్లు వంటివి ఉంటాయి.