బీజేపీ ‘ఛలో బాట సింగారం’ ఉద్రిక్తం .. కిషన్ రెడ్డి అరెస్ట్

బీజేపీ గురువారం తలపెట్టిన ‘ఛలో బాట సింగారం’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ముందస్తుగానే బీజేపీ నేతలను ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకున్నారు. బాట సింగారంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సందర్శించకుండా అదుపులోకి తీసుకున్నారు. ఉదయమే నుంచే నేతలను హౌస్ అరెస్ట్ చేసే పనిలో పడ్డారు.
 
మరోవైపు, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఢిల్లీ నుంచి శంషాబాద్ఎయిర్​పోర్ట్​కు చేరుకోగానే పోలీసులు బాటసింగారంలోని డబుల్​ ఇండ్లను పరిశీలించేందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దానితో  భారీ వర్షంలోనూ కిషన్​ రెడ్డి శంషాబాద్​ ఔటర్ రింగ్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు అడ్డుకోవడం పట్ల ఆయన తీవ్రంగా మండిపడ్డారు. 
 
ఎన్ని అడ్డంకులు సృష్టించిన బాట సింగారం వెళ్లి తీరుతామని స్పష్టం చేశారు. తానేమైనా క్రిమినల్ నా? కేంద్ర మంత్రిని అడ్డుకుంటారా? పోలీసు వెహికిల్ అడ్డుపెట్టి ఆపుతారా? నిజాం కన్నా అధ్వానమైన పాలన ఇక్కడ ఉందని అంటూ మండ్డిపడ్డారు. 75 ఏళ్ల భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఓ కేంద్ర కేబినెట్ మంత్రిని ప్రజాసమస్యలను పరిశీలించేందుకు వెళ్తుండగా అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొంటూ పార్లమెంటు స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.
కల్వకుంట్ల కుటుంబ పాలనలో రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఏర్పడ్డాయని కిషన్ రెడ్డి విమర్శించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రఘునందన్ రావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవటంతో శంషాబాద్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనుమతి లేకుండా ఆందోళన కార్యక్రమాలు చేపట్టవద్దని సీపీ చౌహాన్ వారితో మాట్లాడారు. ఈ క్రమంలో బీజేపీ నేతలకు, పోలీసులకు వాగ్వాదం నెలకొంది.

 “నయా నిజాం కేసీఆర్ మరోసారి తన నియంతృత్వ పోకడలను చూపిస్తున్నారు. ప్రజలకు కేటాయించని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించడానికి బాట సింగారం వెళ్తున్న మా నేతలను హౌస్ అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ చేశారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేసే రీతిలో తీసుకున్న ఈ చర్య బీఆర్ఎస్ పార్టీ భయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది” అని కిషన్ రెడ్డి విమర్శించారు. 

దేశంలోని ప్రతి కుటుంబం యొక్క కలలను నెరవేర్చే దిశగా నరేంద్రమోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల ఇళ్లను మంజూరు చేసిందని,  అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేసిందబం ఇంకా ఎన్ని ఇళ్లు కావాలన్నా మంజూరు చేయడానికి సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. 

అయినప్పటికీ పేద ప్రజల గోడు పట్టని కేసీఆర్ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వస్తోందని ధ్వజమెత్తారు. సొంత ఇంటి కోసం ఎదురుచూస్తున్న లక్షలాదిమంది పేదలకు అండగా బిజెపి తెలంగాణ నేడు చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనా కార్యక్రమాన్ని అడ్డుకోవడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజల వ్యతిరేక ప్రభుత్వం అన్న విషయం బట్టబయలైందని విమర్శించారు.  ఒక నేరస్థుడితో, ఉగ్రవాదితో ఎలా వ్యవహరిస్తారో.. ఇవాళ తనతో పోలీసులు అలా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను ప్రగతి భవన్‌లో కూర్చొని అణిచివేస్తారా? అని ప్రశ్నించారు.

ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కూడా పోలీసులు ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ప్రభుత్వ తీరుపై ఈటల ఫైర్ అయ్యారు. “ప్రజాస్వామ్యంలో నిరసనలు చేసే హక్కు ప్రతిపక్షాలకు ఉంది. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే బాధ్యత మాపై ఉంటుంది. కానీ, కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. మమ్ముల్ని నిర్బంధించినంత మాత్రాన మా పోరాటం ఆగదు.మీ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు” అని హెచ్చరించారు. 

అరెస్టులు మాకేం కొత్తకాదు. మీ తీరు మార్చుకోకపోతే ప్రజలే మిమ్మల్ని మార్చడం ఖాయం. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తా అని చెప్పి మోసం చేస్తున్న మీకు వారే తగిన బుద్ధి చెప్తారు. అరెస్ట్ చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను వెంటనే బేషరుతుగా విడుదల చేయాలి” అని ఈటల డిమాండ్ చేశారు.