ఐదు స్థానాలు మెరుగైన భారత్ పాస్ పోర్ట్

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్  కలిగిన దేశంగా సింగపూర్ నిలిచింది. గత ఐదేళ్లుగా అగ్రస్థానంలో ఉన్న జపాన్ ను తాజాగా సింగపూర్ వెనక్కి నెట్టి అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ కలిగిన దేశంగా అవతరించింది.  ఇక భారత్ విషయానికి వస్ గత ఏడాదితో పోలిస్తే 5 స్థానాలను మెరుగుపరుచుకుంది. గతంలో 85వ స్థానంలో నిలిచిన భారత్ ప్రస్తుతం 57 దేశాలకు వీసా రహిత ప్రవేశంతో టోగో, సెనెగల్ తో పాటు సూచీలో 80వ స్థానానికి చేరుకుంది. ఈ దేశాల పాస్ పోర్ట్ తో 57 దేశాల్లో పర్యటించొచ్చు.
 

సింగపూర్ పాస్ పోర్ట్ ఉన్న వారు వీసా రహితంగా, వీసా ఆన్ అరైవల్ విధానంలో ప్రపంచవ్యాప్తంగా 192 దేశాల్లో పర్యటించవచ్చు. అన్ని దేశాల పాస్ పోర్ట్ ల ర్యాంకింగ్స్ కు సంబంధించిన నివేదికను లండన్ కు చెందిన ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ ‘హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్’ తాజాగా విడుదల చేసింది.  ఆ నివేదిక ప్రకారం గత ఐదేళ్లుగా అగ్రస్థానంలో ఉన్న జపాన్ ప్రస్తుతం మూడో స్థానానికి పడిపోయింది. ఈ పాస్ పోర్ట్ ద్వారా గతంలో 193 దేశాల్లో పర్యటించే అవకాశం ఉండేది. కానీ, ప్రస్తుతం 189 దేశాల్లో మాత్రమే పర్యటించొచ్చు.  ఇక ఈ జాబితాలో జర్మనీ, ఇటలీ, స్పెయిన్ రెండో స్థానంలో నిలిచాయి. 

 
ఈ దేశాల పాస్ పోర్ట్ ల ద్వారా 190 దేశాల్లో తిరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, స్వీడన్, లక్సెంబర్గ్ దేశాలు మూడో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్ పోర్ట్ లు కలిగిన వారు 189 దేశాల్లో తిరగొచ్చు. డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్, యూకే నాలుగో స్థానంలో ఉన్నాయి. ఈ దేశాల పాస్ పోర్ట్ లు కలిగిన వారు స్వేచ్ఛగా 188 దేశాలను చుట్టేయొచ్చు.ఇక బెల్జియం, చెక్ రిపబ్లిక్, మాల్టా, న్యూజిలాండ్, నార్వే, పోర్చుగల్, స్విట్జర్లాండ్ దేశాలు ఐదో స్థానంలో నిలిచాయి. ఈ పాస్ పోర్ట్ తో మొత్తం 187 దేశాలు తిరిగిరావొచ్చు. ఇక ఆస్ట్రేలియా, హంగారీ, పోలాండ్ ఆరో స్థానంలో ఉన్నాయి. ఈ పాస్ పోర్ట్ తో 186 దేశాల్లో ప్రయాణించే వీలు ఉంది.  ఇక కెనడా, గ్రీక్ ఏడో స్థానంలో ఉన్నాయి. ఈ పాస్ పోర్ట్ లతో ప్రపంచంలో 185 దేశాలను చుట్టేయొచ్చు.

ఇక అగ్రరాజ్యం అమెరికా, లిథునేవియా మాత్రం 184 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణించే వీలుతో ఎనిమిదో స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో తాలిబన్ల దేశం అఫ్ఘానిస్థాన్ అట్టడుగున ఉంది. ఈ పాస్ పోర్ట్ తో 27 దేశాలకు మాత్రమే సులభంగా చేరుకునే అవకాశం ఉంది. యెమెన్ (99), పాకిస్థాన్ (100), సిరియా (101), ఇరాక్ (102) చివరి స్థానాల్లో నిలిచాయి.