టెస్టు ర్యాంకుల్లో టీమిండియా స్పిన్ ద్వయం అశ్విన్, జడేజా

ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో అశ్విన్ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో 884 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా కూడా తన ర్యాంకు మెరుగుపరుచుకున్నాడు. 779 రేటింగ్ పాయింట్లతో ఏడో స్థానానికి చేరాడు. 

బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఆస్ట్రేలియా పేస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. అతడి ఖాతాలో 828 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఆ తర్వాత కగిసో రబాడ (825 పాయింట్లు), జేమ్స్ ఆండర్సన్ (805 పాయింట్లు), షాహిన్ షా అఫ్రిది (787 పాయింట్లు), స్టువర్ట్ బ్రాడ్ (781 పాయింట్లు) వరుస స్థానాల్లో కొనసాగుతున్నారు.

బ్యాటింగ్ విభాగంలో న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ 883 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. టీమిండియా నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమే టాప్-10లో ఉన్నాడు. 751 రేటింగ్ పాయింట్లతో అతడు పదో స్థానంలో కొనసాగుతున్నాడు. 

ఈ జాబితాలో రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ (874 పాయింట్లు), మూడో స్థానంలో బాబర్ ఆజమ్ (862 పాయింట్లు), నాలుగో స్థానంలో స్టీవ్ స్మిత్ (855 పాయింట్లు), ఐదో స్థానంలో లబుషేన్ (849 పాయింట్లు), ఆరో స్థానంలో జో రూట్ (842 పాయింట్లు), ఏడో స్థానంలో ఉస్మాన్ ఖవాజా (824 పాయింట్లు), 8వ స్థానంలో డారిల్ మిచెల్ (792 పాయింట్లు), 9వ స్థానంలో కరుణరత్నె (780 పాయింట్లు) ఉన్నారు.

మరోవైపు ఆల్‌రౌండర్ల విభాగంలో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా అగ్రస్థానంలో ఉన్నాడు. అతడి ఖాతాలో 449 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రెండో స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ (362 పాయింట్లు) కొనసాగుతున్నాడు. 

షకీబుల్ హసన్ (332 పాయింట్లు), బెన్ స్టోక్స్ (331 పాయింట్లు), అక్షర్ పటేల్ (303 పాయింట్లు), జాసన్ హోల్డర్ (284 పాయింట్లు), జో రూట్ (256 పాయింట్లు), మిచెల్ స్టార్క్ (245 పాయింట్లు), కైల్ మేయర్స్ (245 పాయింట్లు), ప్యాట్ కమిన్స్ (229 పాయింట్లు) వరుస స్థానాల్లో కొనసాగుతున్నారు.

6వ స్థానంలో స్మృతి మందన

కాగా, బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన భారత మహిళా క్రికెటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సత్తాచాటలేకపోయారు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మందన 6వ స్థానంలో నిలువగా, కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ 8వ స్థానానికి పడిపోయింది. 
 
మందన ఖాతాలో 704 ర్యాంకింగ్‌ పాయింట్స్‌ ఉండగా, హర్మన్‌ప్రీత్‌ 702 పాయింట్స్‌తో నిలిచింది. మంగళవారం 27వ పుట్టిన రోజు జరుపుకున్న స్మృతి గత ర్యాంకింగ్స్‌తో పోల్చుకుంటే ఒక స్థానాన్ని మెరుగు పర్చుకుంది. ఆస్ట్రేలియా ప్లేయర్‌ బెత్‌ మూనీ (769) అగ్రస్థానంలో నిలువగా, నటాలియా స్కీవర్‌ (ఇంగ్లండ్‌ 763), చమరి ఆటపట్టు (శ్రీలంక 734) వరుసగా ద్వితీయ, తృతీయ ర్యాంక్‌లు దక్కించుకున్నారు.