ప్రముఖ రచయిత శ్రీరమణ కన్నుమూత

ప్రముఖ కథకుడు, రచయిత, జర్నలిస్ట్, సినీ రచయిత, వ్యంగ్య వ్యాసకర్త శ్రీరమణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన  హైదరాబాద్లోని తన స్వగృహంలో బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 70 ఏళ్లు. 
జాతీయ అవార్డు అందుకున్న ‘మిథునం’ సినిమాకు కథను ఆయనే అందించారు. శ్రీరమణది అసలు పేరు వంకమామిడి రాధాకృష్ణ లేదా రమణగారు, 1952, సెప్టెంబర్ 21న గుంటూరు జిల్లా, వేమూరు మండలానికి చెందిన వరహాపురం అగ్రహారం అనే గ్రామంలో జన్మించారు. స్కూల్ రోజుల నుండే రమణ గారు సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నారు. 
 
వేమూరు జిల్లా పరిషత్ హై స్కూల్ ఎస్.ఎస్.ఎల్.సి పూర్తి చేశారు. అప్పుడే, రామకృష్ణ మిషన్ ఆశ్రమం, నరేంద్రపూర్, 24 పరగణాల జిల్లా వారు స్వామి వివేకానందునిపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. రమణకు  జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి వచ్చింది, ఒకసారి కాదు రెండు సార్లు కాదు, వరసగా ఆరేళ్ళు ప్రధమ బహుమతి గెలుచుకున్నారు. 
అలాగే రమణ పన్నెండేళ్ళ వయసులో ఉన్నప్పుడు విజయవాడ ఆకాశవాణి నుంచి యువజనుల కార్యక్రమంలో ఆయన ఇంటర్వూ వచ్చింది. బాపట్లలో తాతగారి ఇంట వుండి కాలేజి ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో పియుసిలో చేరారు. అయితే (తల్లిగారు తరపున) తాతగారికి ఆడపిల్లలే కానీ మగపిల్లలు లేరు. అప్పుడు రమణ గారిని దత్తత తీసుకున్నారు.
 
అప్పటివరకు వంకమామిడి రాధాకృష్ణగా వున్న అతను దత్తత తీసుకున్నాక పేరు కామరాజు రామారావుగా మారింది. రెండు పేర్లు, రెండు ఇంటి పేర్లు ఎందుకు అందరికీ గందరగోళం పెట్టడం అని ‘శ్రీ రమణ’ గా మార్చుకున్నారు. పేరడీ రచనలకు, వ్యంగ్య హాస్య భరితమైన కాలమిస్టుగా, కథకుడిగా, అలాగే సాహిత్య, కళా రంగాల్లో శ్రీరమణ గారికి మంచి పేరుంది.
 
ఆయన తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలైన బాపు, రమణలతో కలిసి పని చేశారు.  శ్రీకాలమ్, శ్రీఛానెల్, చిలకల పందిరి, హాస్య జ్యోతి, మొగలి రేకులు వంటి ఎన్నో శీర్షికలు ఆయన నుంచే వచ్చాయి. తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ ప్రధాన పాత్రల్లో 2012లో వచ్చిన మిథునం సినిమాకు కథ అందించింది శ్రీరమణనే
 
2014లో హాస్య రచన విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఆయన కీర్తి పురస్కారాన్ని అందుకున్నారు.  ‘పత్రిక’ అనే మాస పత్రికకు ఆయన గౌరవ సంపాదకుడిగా కూడా వ్యవహరించారు. ఇదే సమయంలో సాహిత్య, కళారంగాల్లో తనదైన సేవ చేశారు. ఆయన మతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలుపుతున్నారు.