ప్రతిపక్షాల సదస్సుకు ధీటుగా ఎన్డీఏ సమావేశం

2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్ధం ఛేస్తున్నాయి. ఒక వంక, గురువారం నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నూతన పార్లమెంట్ భవన్ లో జరగనుండగా, మంగళవారం కీలకమైన ఎన్నికల వ్యూహరచనకై పోటాపోటీగా భేటీలు జరుపుతున్నారు.  గత నెల 23న పాట్నాలో జరిగిన భేటీకి కొనసాగింపుగా ప్రతిపక్షాలు బెంగళూరులో సమావేశం అవుతున్నాయి.
ఒకరిపై మరొకరు అలకలకు స్వస్తి పలికి, వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకొనే ముందడుగు వేసేందుకు సిద్ధపడుతున్నాయి.  అదే సమయంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ఢిల్లీలో భేటీ జరుపుతుంది. 2019 ఎన్నికల అనంతరం జరుగుతున్న మొదటి భేటీ కావడం గమనార్హం. ప్రతిపక్ష భేటీకి 26 పార్టీలు హాజరవుతుండగా, ఎన్డీయే భేటీకి 38 పార్టీలు హాజరవుతున్నట్లు బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ప్రకటించారు. 
 
ఇక ప్రతిపక్ష కూటమికి ఒక నేత కానీ, నిర్ణయాలు తీసుకునే అధికారం కానీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం, గ్రూప్ ఫోటోలు దిగడం కోసం ఏర్పాటైన కూటమి అంటూ విమర్శించారు. ఎన్డీయే ఒక ఆదర్శనీయమైన కూటమి అని, దేశ పటిష్టత, సేవల కోసం పనిచేస్తోందని తెలిపారు.  కర్ణాటక ఎన్నికల అనంతరం ప్రతిపక్షాలలో ఉమ్మడిగా వ్యవహరిస్తే విజయం సాధించగలమనే విశ్వాసం పెరుగుతుండగా, లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఏడాదిలోపే సమయం ఉండటంతో విపక్షాల వ్యూహాలను బద్దలు కొట్టేలా పక్కా ప్రణాళికను బీజేపీ రచిస్తోంది. 
 
కీలకమైన ఎన్సీపీ మహారాష్ట్రలో చీలికకు గురవడం ఒక విధంగా ప్రతిపక్ష శిబిరంలో నీలినీడలు క్రమ్ముకున్నాయి.  ఒకవైపు గత 9 ఏళ్లుగా నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలు, తీసుకున్న నిర్ణయాలు సహా వివిధ అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న బీజేపీ మరోవైపు పొత్తులు, ఎన్డీఏ కూటమిని విస్తరించడం పట్ల దృష్టి సారించింది.  ఇంతవరకూ లబ్ధిదారులకు రూ.29 లక్షల కోట్లు నేరుగా వారి అకౌంట్లలోకి జమ అయ్యాయని బిజెపి నేతలు తెలుపుతున్నారు.
 
ప్రతిపక్ష పార్టీలతో పాటు కొత్త పార్టీలను కూడా ఎన్డీఏలోకి ఆహ్వానించడం, గతంలో ఎన్డీఏలో ఉండి తర్వాత బయటికి వెళ్లిన వారిని కూడా మళ్లీ చేర్చుకోవడం వంటి రాజకీయ వ్యూహాలకు కూడా పదును పెడుతూనే ఉంది. ఇటీవలి కాలంలో ఎన్డీఏ కూటమి విస్తృతమవుతోందని బీజేపీ  అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకాలు, తీసుకున్న సానుకూల నిర్ణయాలతో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు.
 
 2019 లో ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతంలో ఓబీసీ ఓటర్లలో ప్రభావం చూపగలిగే సత్తా గల  సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓపీ రాజ్‌భర్ తిరిగి ఎన్డీయేలో చేరారు. ఇక బిహార్‌లోని ఓబీసీ నాయకుడు, లోక్‌ జనశక్తి పార్టీలో చీలిక తెచ్చిన చిరాగ్ పాశ్వాన్‌ను కూడా ఢిల్లీలో జరిగే ఎన్డీయే సమావేశానికి జేపీ నడ్డా ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటిసారి ఎన్డీయే సమావేశంకు హాజరవుతున్నారు. 
మంగళవారం జరగనున్న ఎన్‌డిఎ సమావేశం గురించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలన్నీ సంఘఠితం కావడాన్ని చూసి వెన్నలో వణుకుపుట్టిన బిజెపి ఇప్పటికే ముక్కలు చెక్కలైన పార్టీలన్నీ ఒక చోటికి చేర్చడానికి ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు.
 
బెంగళూరులో విపక్షాల భేటీ గురించి జేడీఎస్ నేత  హెచ్‌డి కుమారస్వామి ఘాటుగా స్పందిస్తూ ఇది ప్రతిపక్ష సమావేశం కాదని, కాంగ్రెస్ ఘనత చాటుకునేందుకు సిద్ధం చేసుకున్న వేదిక అని విమర్శించారు. ఏదో గొప్ప పని చేశామని తెలియ చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో రైతుల ఆత్మహత్యల విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని మండిపడ్డారు.
 
కేవలం అధికార దాహంతో అంతకు మించిన అవకాశవాదంతో ప్రతిపక్షాలు బెంగళూరు భేటీ తలపెట్టాయని బిజెపి విమర్శించింది. ఈ నేతలకు ప్రజల కన్నా దేశం కన్నా తమ అధికారంపైనే దృష్టి అని బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ప్రతిపక్ష బృందం దేశానికి ఇప్పుడే కాదు ఎప్పటికీ ఏ మంచి చేయలేదని స్పష్టం చేశారు.