ఉమ్మడి పౌరస్మృతిపై ఎటూ తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్

కేంద్రంలోని నరేంద్ర మోదీ  ప్రభుత్వం రాజ్యాంగం నిర్ధేశించిన విధంగా ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుండగా, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం ఈ విషయమై ఎటూ తేల్చుకోలేక పోతున్నది. రాజ్యాంగసభలో జవహర్ లాల్ నెహ్రు వంటి నేతలు అప్పట్లో దీనికోసం పట్టుబట్టారు. అయితే, వివిధ కారణాల చేత సాధ్యం కాలేదు.
 
వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఈ అంశంపై స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేయడం కాంగ్రెస్ కు ఒక విధంగా ఇరకాట పరిస్థితి కలిగిస్తున్నది. ఈ అంశంపై దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు చాలావరకు స్పష్టమైన అభిప్రాయలు సానుకూలంగా, వ్యతిరేకంగా వ్యక్తం చేస్తుండగా, దేశంలోనే పురాతన రాజకీయ పక్షమైన కాంగ్రెస్ మాత్రం తికమక పడుతుంది.
 
అయితే, ఉమ్మడి పౌరస్మృతి గురించి చర్చించేందుకు కాంగ్రెస్ లో న్యాయసంబంధ అంశాలపై నిష్ఠతనులైన వారితో శనివారం ఒక `అనధికారిక’ సమావేశం జరిపింది. ఈ అంశంపై ఇప్పుడే ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని, కేంద్రం ముసాయిదా బిల్లును తీసుకు వచ్చిన తర్వాతని ఈ విషయమై పార్టీ ఓ వైఖరిని తీసుకోవాలని ఈ బృందం పార్టీ నాయకత్వానికి సూచించినట్లు తెలుస్తోంది.  
 
ఈ భేటీలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పి చిదంబరం, సల్మాన్ ఖుర్షీద్, అభిషేక్ సింఘ్వీ, వివేక్ తంఖా, మనీష్ తివారీ, కెటిఎస్ తులసి తదితరులు సమావేశమై ఉమ్మడి పౌరస్మృతికు సంబంధించిన చట్టపరమైన, సామాజిక అంశాలపై ఒకటిన్నర గంటలకు పైగా చర్చించారు. వీరు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఓ నివేదిక ఇవ్వనున్నారు.

అయితే, ఉమ్మడి పౌరస్మృతి విషయమై కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయాలని బీజేపీ ఇప్పటికే ఒత్తిడి తెస్తున్నది. దేనికి బిజెపి వ్యతిరేకమా లేదా అనుకూలమా అని నిలదీస్తుంది. అయితే అందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లు తీసుకొచ్చేందుకు వేచి చూడాలని ఈ నెల మొదట్లోనే కాంగ్రెస్ ఓ నిర్ణయం తీసుకుంది. 

లా కమీషన్ ఈ విషయమై అభిప్రాయాలు సేకరిస్తుండటం, మరోవంక భోపాల్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించడంతో రానున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ విషయమై ప్రభుత్వం ఒకడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం
తదుపరి చర్యలు తీసుకొనేవరకు వేచి ఉండాలని కాంగ్రెస్ భావిస్తోంది.
 
ప్రభుత్వం ముసాయిదా బిల్లును తీసుకు రాకుండా ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోవడం తొందరపాటు చర్య కాగలదని వెనుకడుగు వేస్తుంది.  ఏదేమైనా ఉమ్మడి పౌరస్మృతిని మొత్తంగా వ్యతిరేకించే సాహసం చేయకపోయినా, “వైవిధ్యంపై దాడి”గా కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
 
వ్యక్తిగత చట్టాలను సవరించడం ద్వారా వ్యక్తిగత చట్టాల్లో సంస్కరణలు తీసుకురావచ్చని ఈ బృందం పేర్కొన్నట్లు తెలిసింది. అయితే పార్టీ మద్దతిచ్చే లింగ సమానత్వం వంటి అంశాలకు పార్టీ సమాధానం చెప్పాల్సి రావచ్చని భావిస్తున్నారు.  పైగా కీలక సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ అంశాన్ని ఇప్పుడు తీసుకు వస్తున్నారనే ప్రచారం చేయడం ద్వారా “బీజేపీ ట్రాప్”లో పెడుతున్నామనే ఆందోళన కూడా ఆ పార్టీ వర్గాలలో వ్యక్తం అవుతుంది.

“వారసత్వ సమానత్వం వంటి అంశాలకు మేము మద్దతు ఇస్తాము. కానీ ఏకరూపత విధింపును వ్యతిరేకిస్తాం. అంతా ప్రభుత్వ ఉద్దేశంపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత చట్టాలను సంస్కరించే విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందో లేక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని బిల్లు తెస్తుందో చూడాలి’’ అంటూ ఈ విషయమై దాటవేసే ధోరణికి ప్రస్తుతం ఆ ఆపార్టీ పరిమితం అవుతున్నట్లు స్పష్టం అవుతుంది.

ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల అనంతరం తిరిగి ముస్లింల ఓట్లపై ఆ పార్టీలో ఆశలు చిగురించడం, పలు ముస్లిం వర్గాలు ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తుండటంతో కాంగ్రెస్ నిర్దిష్టంగా ఒక వైఖరి తీసుకొనేందుకు వెనుకాడుతున్నట్లు స్పష్టం అవుతుంది. 
 
పైగా, ముస్లిం మహిళలు, విద్యావంతులలో అత్యధికులు అందుకుకే సుముఖంగా ఉన్నట్లు పలు సర్వేలు స్పష్టం చేయడం సహితం మొత్తంగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించడం సాహసం కాగలదని బెరుకు కూడా ఆ పార్టీలో వ్యక్తం అవుతుంది. ఈ విషయమై ప్రతిపక్ష శిబిరంలో సహితం ఏకాభిప్రాయం లేకపోవడం గమనార్హం. ఆప్, శివసేన (యుబిటి) ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపాయి. బీఎస్పీ సహితం తాము వ్యతిరేకం కాదని తెలిపింది.