ఏపీలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం

ఏపీలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పాలిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి  పురంధేశ్వరి ధ్వజమెత్తారు. రాష్త్ర అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత మొదటిసారిగా రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిపిన ఆమె మీడియాతో మాట్లాడుతూ మద్యం డిస్టిలరీస్ అన్నీ అధికార పార్టీ పెద్దల సన్నిహితులకే ఇచ్చారని ఆరోపించారు. 

మద్యం అమ్మకాల్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతోందని పేర్కొంటూ సీఎం ఇంటి సమీపంలో అత్యాచారం జరిగినా న్యాయం జరగని పరిస్థితి నెలకొందని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు. పదో తరగతి పిల్లవాడిని, ఓ ఉపాధ్యాయుడిని పట్టపగలు చంపేస్తోన్న పరిస్థితి ఉందని ఆమె పేర్కొన్నారు. యాప్ నొక్కితే చాలు పోలీసులొచ్చేస్తారని సీఎం జగన్ చెప్పారని పేర్కొంటూ కానీ అలా జరుగుతోందా? అని ఆమె ప్రశ్నించారు.

యువతకు ఉపాధి అన్నారని, కానీ అలా జరగడం లేదని చెబుతూ వాలంటీర్లు పర్మినెంట్ ఉద్యోగులు కారని, వారిని కలుపుకుని ఉపాధి కల్పించామనే లెక్కలు వేసి చెబుతున్నారని పురందేశ్వరి ధ్వజమెత్తారు.  రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని,  వచ్చిన పరిశ్రమలు ఉండడం లేదని, లూలూ, జాకీ వంటి కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయని ఆమె విమర్శించారు.

రాష్ట్రంలో ఇసుక దందా భారీ ఎత్తున జరుగుతోందని ఆరోపించారు. సుప్రీంకోర్టు కూడా ఇసుక తవ్వకాలు ఆపాలని ఆదేశించిందని ఆమె గుర్తు చేశారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడానికి అక్రమ ఇసుక తవ్వకాలే కారణమని పురంధేశ్వరి విమర్శించారు. ఇసుక మాఫియాతో పేదల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు. 

ఇసుక మాఫియాతో నేతలు జేబులు నింపుకుంటున్నారని ఆమె ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో పేదల జీవితాలు ఛిద్రమవుతున్నాయని చెబుతూ  ప్రజల సమస్యలపై పోరాడితేనే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని పురంధేశ్వరి భరోసా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎటుచూసిన సమస్యల వలయంగా కనిపిస్తుందని ఆరోపించారు. 

సర్పంచులు పార్టీలకతీతంగా కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించడంపై ఆందోళన చేస్తున్నారని ఆమె గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్ని రకాలుగా సహకారం చేస్తుందని చెబుతూఇళ్లకు రంగులు మార్చడంపై ఉన్న శ్రద్ధ, ఇళ్ల నిర్మాణంపై ఈ ప్రభుత్వంకు లేదని ఆమె ఎద్దేవా చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను దారిమళ్లిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఏపీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసిందని మాజీ కేంద్ర మంత్రి విమర్శించారు.

పార్టీని బలోపేతం చేయడం అందరి బాధ్యత
 
తనపై గురతర బాధ్యతలు ఉన్నాయని చెబుతూ పార్టీని బలోపేతం చేయడం తన ఒక్కరి వల్లే సాధ్యం కాదని ఆమె రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశం మాట్లాడుతూ చెప్పారు. ప్రతి కార్యకర్త తనకు సహకారం అందించినప్పుడే పార్టీ బలోపేతం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. ఎన్నికలకు ఐదారు నెలల సమయమే ఉందని చెబుతూ అన్ని స్థాయిల్లోని కమిటీలను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుందని పురంధేశ్వరి చెప్పారు.
పార్టీని బలోపేతం చేయడంతో పాటు.. రాజకీయంగా వేసే అడుగులపైనా ఆలోచించాలని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పార్టీని ప్రజలకు చేరువ చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు. 2014 తర్వాత పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఒంటరిగా వెళ్లాలని చాలా మంది సూచించారని చెబుతూ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ముందు కసరత్తు చేయాలని అధినాయకత్వం సూచించిందని పురంధేశ్వరి తెలిపారు.