
బాబీ సింహా, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే నటీనటులుగా సమర్ వీర్ క్రియేషన్స్ బ్యానర్‌పై యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘రజాకార్’. ఈ సినిమా పోస్టర్‌ను శుక్రవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది.
మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ‘‘అప్పట్లో ఇక్కడ 8 జిల్లాలుండేవి. ఇక మహారాష్ట్రలో 5 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు అన్నీ కలిసి హైదరాబాద్ సంస్థానంలో ఉండేవి. ఇవన్నీ ఓ దేశంగా ఉండాలంటూ బ్రిటీష్ ప్రభుత్వం బలహీనమైన చట్టాన్ని విడుదల చేసిన కారణంగా నిజాం ప్రభువు స్వతంత్య్ర రాజ్యంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అతని బలంగా లక్ష, రెండు లక్షలు మంది కలిసి రజాకార్స్ సైన్యంగా ఏర్పడ్డారు. ఎన్నో అకృత్యాలు చేశారు” అని తెలిపారు.
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 17 నెలల తర్వాత హైదరాబాద్‌కు స్వాతంత్య్రం వచ్చిందని చెబుతూ ఇస్లాంవేరు, రజాకార్లు వేరని స్పష్టం చేశారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో ముస్లిం సోదరులు చాలా మందే ఉన్నారని పేర్కొంటూ మౌలానా, తురేబాజ్ ఖాన్ వంటి ఎందరో హైదరాబాద్ స్వాతంత్య్రం కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. ఇలాంటి చరిత్రతో చేసిన రజాకర్ సినిమాను చూసి ప్రోత్సహించాలని చెప్పారు.
పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ మాట్లాడుతూ ‘‘కశ్మీర్ ఫైల్స్ సినిమా చూసినప్పుడు.. పాతబస్తీ ఫైల్స్ అనే సినిమా చేద్దామని నేను, నారాయణ రెడ్డన్న అనుకున్నాం. అయితే ముందు రజాకార్ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడున్న యువతకు మన చరిత్ర గురించి తెలియదు. చరిత్రను చూపెట్టటానికి చాలా మంచి ఆలోచిస్తారు” అని తెలిపారు.
కొందరేమో నైజాం పాలనను స్వర్ణయుగంగా అభివర్ణిస్తారని, చరిత్రను చరిత్రగా చూపెట్టాలంటే కూడా దాన్ని ఓ మతం కోణంలో చూపెట్టాలనే ప్రయత్నం చేస్తారని విచారం వ్యక్తం చేశారు. జరిగిన చరిత్రను మతం కోణంలో కాకుండా జరిగింది జరిగినట్లు చూపెట్టటానికి గూడూరు నారాయణరెడ్డి, యాటా సత్యనారాయణ కలిసి రజాకార్ సినిమా చేశారని అభినందించారు.
సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ రజాకార్ సినిమాను నిర్మించటానికి చాలా గట్స్ కావాలని చెప్పారు. “నా తల్లిదండ్రులు సుద్దాల హనుమంతు, జానకమ్మ.. ఇద్దరూ రజాకార్లు, నైజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం చేసినవారే. ఒకరు పెన్‌తో పోరాటం చేస్తే.. మరొకరు గన్‌తో పోరాటం చేశారు. అందుకే ఈ సినిమాలో పాటలు రాసే అవకాశం దక్కిందని నేను భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి మాట్లాడుతూ తనకు తాతగారి పేరునే పెట్టారని చెబుతూ ఆయన స్ఫూర్తితోనే రజాకార్ అనే సినిమాను తీశానని తెలిపారు. నిజాం ప్రభుత్వ హయాంలో రజాకార్లు చేసిన అకృత్యాలకు అడ్డే లేదని చెప్పారు.
“ఇండియన్ ఐరన్ మ్యాన్ అని మనం పిలుచుకునే సర్దార్ వల్లభాయ్ పటేల్‌గారు ఎప్పుడైతే మిలటరీని ఇక్కడకు పంపారో అప్పుడు రజ్వీ మా గ్రామంలోకి ప్రవేశించటానికి ప్రయత్నించారు. అప్పుడు మా తాతగారు ఆయన్ని గ్రామంలోకి రానీయకుండా అడ్డుకున్నారు. రజ్వీకి, మా తాతయ్యకు మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది. దాని గురించి నాకు చాలా మంది మా పెద్దవాళ్లు చెప్పారు” అని గుర్తు తెచ్చుకున్నారు.
మన చరిత్రలో చాలా విషయాలను బయటకు తెలియనీయకుండా చేశారని అంటూ “ఇప్పుడా విషయాలు గురించి నేను మాట్లాడను. తెలంగాణవాదిగా నేను నా హక్కుగా, భారతీయుడిగా భావించి రజాకార్ అనే సినిమా చేశాను. అంతే తప్ప..నేను ఎవరినీ కించపరచటానికి ఈ సినిమా చేయలేదు’’ అని వివరించారు.
చిత్ర దర్శకుడు యాటా సత్యనారాయణ మాట్లాడుతూ ‘‘మహా సముద్రంలాంటి సబ్జెక్ట్‌ను సినిమాగా తీయటానికి అవకాశం ఇచ్చిన నిర్మాత నారాయణ రెడ్డిగారికి ధన్యవాదాలు. విమోచన, విముక్తి కోసం చేసిన పోరాటం స్ఫూర్తిగా చేసిన సినిమా ఇది. 800 మంది హీరోలున్న చరిత్ర ఇది. హైదరాబాద్‌కు స్వాతంత్య్రం తెచ్చిన కథ ఇది” అని తెలిపారు.
“ఇది మత చరిత్ర కాదు.. మదలించే చరిత్ర కాదు.. మన చరిత్ర. రజాకార్ సినిమా చూడకపోతే.. మన బ్రతుకుకి అర్థమే లేదు’’ అని చెప్పారు. హీరోయిన్ వేదిక మాట్లాడుతూ ‘‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొన్ని నెలల తర్వాత హైదరాబాద్‌కి స్వాతంత్య్రం వచ్చిందని తెలిసి ఆశ్చర్యపోయాను. అలాంటి చరిత్ర ఆధారంగా తెరకెక్కిన రజాకార్ సినిమాను అందరూ ఆదరించాలి. ఈ సినిమా చేయటం గౌరవంగా భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
More Stories
పాత బస్తీలో హైడ్రా కూల్చివేతలు చేయగలరా?
భారత్ లో ఓటింగ్‌ను పెంచేందుకు అమెరికా నిధులు?
కేసీఆర్ బాటలోనే నడుస్తున్న రేవంత్ రెడ్డి